అగ్రహారమే ఎన్నికల ఎజెండా!

Apr 23,2024 21:25

తాతలు, తండ్రుల కాలం నుంచి హక్కులు లేకుండా అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. పాలకులు మారుతున్నారు తప్ప అగ్రహార భూముల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మే 25న భూములకు అప్పటి తహశీల్దార్‌ పబ్లిక్‌ నోటిఫికేషన్‌ వేసి అన్నదాతల్లో ఆశలు రేపారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములను ఇనాం వాటా కింద 1/3 షేర్‌ కేటాయించిన అధికారులపై మండిపడినప్పటికీ.. ఇప్పటికైనా భూసమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ఆశ పడ్డారు. నోటిఫికేషన్‌లో అనేక తప్పుల తడకలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నించకుండా అధికారులకు సహకరించాలని భావించారు. తమ భూములపై అభ్యంతరాలను అధికారుల సూచనల మేరకు అందజేశారు. ఈ పక్రియ జరిగి సుమారుగా ఏడాది కావస్తున్నా… అగ్రహారంపై ఎటువంటి అడుగులూ ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావడం ప్రస్తుతం అగ్రహార సమస్య ఎన్నికల ఎజెండాగా మారింది.

ప్రజాశక్తి – జామి  : ఎన్నికలు సమీపిస్తున్న వేళ జామి అగ్రహార భూముల సమస్య నాయకులకు అసలు ఎజెండాగా మారింది. తాతలు తండ్రుల నుంచి భూ హక్కులు సిద్ధించక నానా అవస్థలు పడుతున్న రైతాంగానికి పాలకులు మొండిచేయి చూపిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీకి చేసే నేతలు అగ్రహార భూ సమస్యకు కచ్చితమైన హామీ ఇవ్వాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హామీతో పాటు అమలు చేసే వారికే ఓటు వేయాలని ఈ ప్రాంత రైతాంగం భావిస్తోంది. జామి మండల కేంద్రంలో సుమారుగా 2600 ఎకరాల వరకు ఇనాం భూములు (అగ్రహారం) కింద ఉన్నాయి. వీటికి హక్కులు కల్పించాలని రైతులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2009లో భూ సర్వే ప్రారంభమై, గత ఏడాది 25న అప్పటి తహశీల్దార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 30 రోజుల్లో నోటీసులో పొందుపర్చిన వివరాలపై అభ్యంతరాలు తెలపాలని పేర్కొన్నారు. అంతుపట్టని పలు అంశాలు నోటిఫికేషన్‌లో రావడంతో అప్పట్లో రైతులు గందరగోళానికి గురయ్యారు. ప్రధానంగా నోటిఫికేషన్‌లో ఇనాందారుని పేరు రాయకుండానే ఇనాం వాటా కింద 1/3 భూమిని కేటాయించడం గందరగోళాన్ని సృష్టించింది.. ఇనాంఅండ్‌ ఎస్టేట్‌ అనాలిసిన్‌ యాక్ట్‌ ప్రకారం సాగుదారునికి 2/3, ఇనాందారునికి 1/3 వాటా భూమి కేటాయించడం న్యాయమే. కానీ తాతల తండ్రుల కాలం నుంచి కానరాని ఇనాందారుడి పేరున భూ కేటాయింపు చేయడం ఏంటని ప్రశ్నలు లేవనెత్తారు. అయినప్పటికీ అధికారులు చెప్పిన మాటలకు కట్టుబడి నోటిఫికేషన్‌ ప్రక్రియ ముందుకు సాగాలని రైతులు భావించారు. కానీ సుమారుగా ఏడాది కాలం సమీపిస్తున్నా నోటిఫికేషన్‌ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అగ్రహారం భూ సమస్యపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చేలా, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రకటనలు ఇవ్వాలని, అటువంటి నేతలకే ఓటు వేయాలని రైతులు బావిస్తున్నారు.

➡️