ఆస్తి ఘనం.. అంతా అన్యాక్రాంతం

May 23,2024 21:01

 ఆలయ భూములు ఆక్రమణ పట్టించుకోని దేవాదాయ శాఖ

ఈనెల 26,27,28 తేదీలలో ధారగంగమ్మ అమ్మవారి పండగ

ప్రజాశక్తి-శృంగవరపు కోట  : శృంగవరపుకోట గ్రామ దేవత ధారగంగమ్మ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఈ ఆలయం ఆధ్వర్యాన రెండేళ్లకు ఒకసారి గ్రామ దేవత అయిన ధార గంగమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా గ్రామ పెద్దలు నిర్వహిస్తూ ఉంటారు. పుణ్యగిరికి వెళ్లే రహదారిలో గల ఈ ఆలయానికి సర్వే నంబర్‌ 185/20 పట్టా నెంబర్‌ 855లో జగ్గు చెరువు నుండి దేవి కూడలి వరకు సుమారు రెండున్నర ఎకరాలు ఉన్న భూములను కొందరు ఆక్రమణదారులు వేరే సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వాటిలో వ్యాపార సముదాయాలు నిర్మించి అక్రమార్జన చేస్తున్నారు. అయినా దీనిపై దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చూపడంతో ఆలయం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు.పట్టణంలోని ధారగంగమ్మ ఆలయానికి రెండున్నర ఎకరాల భూములు ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతమయ్యాయి. దీంతో ఆలయానికి భక్తుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ధూప దీప నైవేద్యాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దారగంగమ్మ ఆలయం, పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయాలకు టిక్కెట్ల విక్రయం, భక్తులు ఇచ్చే కానుకలుద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ అభివృద్ధికి, ధూప దీప నైవేద్యాలకు, పూజారి జీతభత్యాలకు వెచ్చించాల్సి ఉంది. ఈ ఆలయానికి నెలకు సుమారు 5 వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఆలయానికి ఆదాయం లేక సిబ్బంది జీతాలు దేవాదాయ శాఖ సక్రమంగా చెల్లించటం లేదు. ఈ విషయమై ఆలయ కార్య నిర్వాహకులు నాగేంద్ర స్పందిస్తూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణదారుల నిగ్గు తేల్చాలి దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

ఆక్రమణదారుల నిగ్గు తేల్చాలి

గతంలో ఈ ఆలయ భూముల్లో 15 ఎరుకల కుటుంబాలు పాకలు వేసుకుని బుట్టలు, తట్టలు అల్లుకొని జీవనం సాగించాయి. వారిని బలవంతంగా ఖాళీ చేయించి ఆ ఇళ్లను జెసిబిలతో కూల్చారు. మిగతా వారికి పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఆలయ భూములు ఆక్రమించిన మిగతా వారిని కూడా కూడా ఖాళీ చేయించి ఆలయ భూములను స్వాధీనం చేసుకుంటామని అప్పటి దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ చెప్పారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆలయ భూముల్లో పక్కా ఇళ్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు లేవు.

మద్దిల రమణ సిపిఎం మండల కార్యదర్శి

➡️