పోలింగ్‌ కేంద్రం వద్ద కూటమి, వైసిపి ఘర్షణ

May 6,2024 21:03

ప్రజాశక్తి-పాలకొండ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద ఎన్‌డిఎ కూటమి, వైసిపిల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందుగా కూటమి తరపున ఏజెంట్‌గా ఉన్న తేజోవతి పోలింగ్‌ బూత్‌ కేంద్రం లోపలికి వెళ్లడంతో వైసిపి ఏజెంట్‌గా ఉన్న దుప్పాడ పాపినాయుడు, కొంచాడ అరుణ్‌ ఆమెను అడ్డుకుని బూత్‌లోకి వెళ్లి ప్రచారం చేయడమే మిటని నిలదీశారు. అక్కడున్న సహాయ ఎన్నికల అధికారి వరహాలుకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. లిల్లీ పుష్పనాధం మాట్లాడుతూ తేజోవతికి ఎటువంటి ఏజెంట్‌ పాస్‌ లేకుండా పోలింగ్‌ కేంద్రంలోకి ఎలా అనుమతించారని ఎఆర్‌ఒ ను ప్రశ్నించారు. అయితే ఆమెకు ఏజెంట్‌గా అనుమతి ఉందని, పాస్‌ తయారవుతుందని ఏఆర్వో చెప్పటంతో మరింత అసహనం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థికి అనుకూలంగా అధికారులు వ్యవహరించడం సరికాదని, ఇలా అయితే తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్న జనసేన అభ్యర్థి జయకృష్ణకు, వైసిపి వర్గీయులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి కళావతి కూడా అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఎన్నికల నియమావళి పాటించాలని అన్నారు.

➡️