అంగన్‌వాడీల పోరాటం ఉధృతం

పాడేరులో ర్యాలీ చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృదం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం ఉధృతం చేశారు. పాడేరు కలెక్టరేట్‌, రంపచోడవరంలో సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద బైఠాయించారు. ముందుగా భారీ ర్యాలీలు చేపట్టారు. పాడేరు: ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మొండి వైఖరి విడనాడాలని, అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం అల్లూరి జిల్లా కలెక్టర్‌ వద్ద బైఠాయించారు. అంతకుముందు పాత బస్టాండ్‌ నుండి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ, ప్రదర్శనగా కలెక్టరేట్‌కు కదిలి వచ్చారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటలసేపు బైఠాయించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి నాయకురాలు పెంటమ్మ అధ్యక్షత వహించగా ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు డి.నాగమ్మ, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు, బోనంంగి చిన్నయ్య పడాల్‌, వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని విమర్శించారు. సమ్మె 23 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంగన్వాడీలు ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని భారం పెరిగిందని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా కనీస వేతనం చెల్లించలేదని దుయ్యబట్టారు. వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన ఆహార సరుకులు ఇవ్వమని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తక్షణం డిమాండ్లు పరిష్కరించకపోతే జగన్‌ ప్యాలెస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్వాడి పోరాటానికి మద్దతు తెలుపుతూ సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి చవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయాలని బిజెపి కుట్ర చేస్తుందని, దీంట్లో భాగంగానే బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తున్నారన్నారు.ఇటీవల కాలంలో చింతపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనలో గిరిజనుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందని, ఇది జరిగితే స్థానిక గిరిజనులకి తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక నాయకులను చర్చిలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి అనంతగిరి జడ్పిటిసి డి.గంగరాజు మద్దతు తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.బాలదేవ్‌ మద్దతు తెలిపారు. అనంతరం అంగన్వాడి యూనియన్‌ ప్రతినిధులు, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి భాగ్యలక్ష్మి, అంగన్వాడి ప్రాజెక్ట్‌ నాయకులు పి. వెంకటలక్ష్మి, రాజమ్మ, కొండమ్మ, మంజుల, నరసమ్మ సిఐటియు జిల్లా నాయకులు సన్నిబాబు, శంకర్రావు, సత్యనారాయణ, పడాల్‌, మోసియా తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయింపురంపచోడవరం : కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల చేపట్టిన ఆందోళనలో భాగంగా బుధవారం రంపచోడవరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా సమ్మె విరమించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఇదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు శాంతిరాజు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిరిమల్లిరెడ్డి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు వి నిర్మల, రాణి రామలక్ష్మి, వెంకటలక్ష్మి, సింగారమ్మ, 7 మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు.చింతూరు ఆర్‌డిఒ కార్యాలయం వద్ద..చింతూరు : 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎటపాక, కూనవరం, విఆర్‌.పురం చింతూరు నాలుగు మండలాలకు చెందిన సుమారు 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లి నినాదాలు చేస్తూ న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ బెదిరింపులకు లొంగేది లేదని తాడోపేడో తేల్చుకుంటామని, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని శపథం చేశారు. అనంతరం ఐటిడిఎ పిఒకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు నాయకులు పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య, వ్యకాస నాయకులు ఎర్రం శెట్టి శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, అంగన్వాడీలు జయ, చిట్టెమ్మ, కిట్టమ్మ, నూకరత్నం, వెంకటరమణ, సత్యవతి, కనకదుర్గ ు పాల్గొన్నారు.

➡️