మన్యంలో కుండపోత వర్షం

అరకులోయలో కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలో బుధవారం సాయంత్రం కుండపోత కురిసింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఏకధాటిగా ఏడు గంటల వరకు రెండు గంటల పాటు కురిసింది. వర్షం కారణంగా మండల కేంద్రంలోని వీధి కాలువలు,రోడ్లు పూర్తిగా జలమయంగా మారాయి. మన కేంద్రంలోని మూడు రోజుల జంక్షన్‌ గుంటసీమ రోడ్డుపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో మురుగునీరు నివాస గహాలకు నీరు చేరడంతో స్థానికులు పలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం కించుమండలో జరిగిన వారపు సంతకు వచ్చిన గిరిజనులు, వివిధ పనుల నిమిత్తం మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు తిరుగు ప్రయాణంలో పలు ఇబ్బందులు పడ్డారు.అరకులోయ:అరకులోయ పరిసర ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. నిన్నటి వరకు అడపదడపా వర్షం కురిసి ఆగిపోయేది. దీంతో ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన ఈ ప్రాంతవాసులు ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం మాత్రం చలికాలాన్ని తలపించే విధంగా దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తీవ్రమైన ఎండ కాసింది. తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురువడమే కాకుండా పెద్ద పెద్ద శబ్దాలతో పిడుగులు పడడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద కుండపోత వర్షం కురవడం ఇదే తొలిసారి.సాయంత్రం ఏడు గంటలైనా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వాహన చోదకులకు రాకపోకలకు అంతరాయం కలగడంతో ఇబ్బంది పడ్డారు. అరకు -విశాఖ రోడ్డులో వర్షపు నీటితో పలుచోట్ల నిండిపోయాయి. దీంతో పలువురు ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే రోజు వింత వాతావరణం నెలకొని మూడు కాలాలు దర్శన మివ్వడంతో అందరూ ఆశ్వాదించారు.

➡️