ఆదివాసీ గిరిజన సంఘం నిరసన

మాట్లాడుతున్న ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర,

ప్రజాశక్తి- పాడేరు:ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసి జీవో నెంబర్‌ 3కు చట్టబద్ధం కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు ఐటిడిఏ ముందు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ 6100 పోస్టుల్లో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని, పాడేరు ఐటిడిఏ పరిధిలో 99 శాతం ఆదివాసులకు కేవలం 7 పోస్టులే కేటాయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆదివాసి షెడ్యూల్‌ ప్రాంతం పాడేరు, చింతూరు, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 2024 డీఎస్సీలో 500 పోస్టులు నోటిఫికేషన్‌ ఆదివాసులకు 38 పోస్టులు మాత్రమే ఇవ్వడం ఆదివాసులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సామాజిక సాధికారత కోసం మాట్లాడుతుంటారని, 2024 డీఎస్సీలో ఆదివాసులకు అన్యాయం చేస్తూ దగా డిఎస్సి నోటిఫికేషన్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 38 ఉపాధ్యాయ పోస్టులు కేటాయించడం సామాజిక సాధికారత ఎలా అవుతుందని ప్రశ్నించారు. జీవో మూడు కోసం టీఏసీ తీర్మానం చేశామని చట్టబద్ధత కల్పిస్తామని గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకటనలు గుప్పించారని ఇటీవల జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ లో ఆదివాసులకు ఘోరమైన అన్యాయం జరుగుతుంటే ఏమి చేస్తున్నారని అన్నారు. ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ ఆర్డినెన్స్‌ జారీ చేసి జీవో నెంబర్‌ 3 చట్టబద్ధం కల్పించాలని దగా డిఏసి కాకుండా ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పీ అప్పలనర్స మాట్లాడుతూ జీవో మూడు చట్టబద్ధం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. 1/ 70 చట్టం అమల్లో ఉన్న షెడ్యూల్‌ ఆదివాసి ప్రాంతంలో 100శాతం ఆదివాసి అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో ఆదివాసి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించిందని అన్నారు. గతంలో గిరిజన గురుకులం, శిశు సంక్షేమ శాఖ, మెడికల్‌ కళాశాలలో ఒక్క ఆదివాసికి పోస్ట్‌ ఇవ్వకుండా నోటిఫికేషన్‌ ఇచ్చారని విమర్శించారు. ఆదివాసుల జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ ఆదివాసి హక్కుల్ని చట్టాల్ని తుంగలో తొక్కి అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఆదివాసి నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌ ధర్మన్న పడాల్‌, జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణారావు, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్‌ నరేష్‌, కోకన్వీనర్లు చంటి, మత్యరాజు, కృష్ణ, నూకరాజు, ఉపేంద్ర లక్ష్మణ్‌, అర్జున్‌ వెల్సన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️