ఆశ్రమ విద్యార్థులకు మెరుగైన వైద్యం

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్‌.....

ప్రజాశక్తి పాడేరు: ఐటీడీఏ పరిధిలోని అనంతగిరి, ముంచింగిపుట్టు, పాడేరు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలిసుకున్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌ శనివారం రాత్రి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి ఆశ్రమ విద్యార్థులకు ప్రత్యేక వార్డు కేటాయించాలని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కు సూచించారు.రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డులు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఆస్పత్రిలో అన్ని వార్డులు వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వైద్య సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న వైద్య పరికరాలను వినియోగించాలని సూచించారు. సిబ్బంది కొరత పై వైద్య కమిషనర్‌కు లేఖ రాస్తామ్నారు. ముగ్గురు పాఠశాల విద్యార్థులకు చికిత్స అందించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌ కి తరలిస్తున్నామన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వసతి గృహాలలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఉపాధ్యాయులు విద్యతోపాటు విద్యార్థుల ఆరోగ్యం పై దృష్టి సాధించాలని తెలిపారు. విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు పాఠశాల నిర్వాహకులు బాధ్యత వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిఒతో పాటు డిడి కొండలరావు, ఏ టీ డబ్ల్యులు రజిని, వెంకటరమణ ఉన్నారు.

➡️