కల్వర్టులు ఇలా..వెళ్లేది ఎలా…

బాకూరు ఉప్పు ప్రధాన రహదారిలో కూలిన కల్వర్టు

ప్రజాశక్తి -హుకుంపేట:మండంలో తుపాను ప్రభావంతో కల్వర్టులు కోతకు గురై మరమ్మతులు నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో, ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనదారులు, పాదచారులు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి నోచుకోక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో పలు చోట్ల గిరిజనులులే మరమ్మతులు చేపడుతున్నారు. మండలంలోని బి.బొడ్డపుట్టు పంచాయతీ బొర్ర మామిడి గ్రామంలో బాకూరు ఉప్పు ప్రధాన రహదారిలో నవంబర్‌ నెలలో తుపాను ప్రభావంతో కూలి పోయింది. 1994 సంవత్సరంలో కల్వర్టు నిర్మాణం చేపట్టారు. నేటికి 30 సంవత్సరం అవుతోంది. ఇదే రహదారి అనుకుని 10 పంచాయతీల గిరిజనులు రాకపోకలు సాగిస్తున్నారు. చెంత, బాకూరు, బి.బొడ్డ పుట్టు, మత్య్సపురం, పట్టాం, గత్తుం, బూర్జ పంచాయతీ లతో పాటుగా అనంతగిరి మండలం పినకోట, పెద్దకోట, దేవరపల్లి పంచాయతీల గిరిజనులు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 30 గ్రామాల ప్రజలకు ఇదే రహదారి. నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. రెండు మండలాలతో పాటుగా ఎస్‌.కోట, విశాఖపట్నం వేళ్లేందుకు ఇదే సులువైన రహదారి. తుఫాను ప్రభావంతో కల్వర్టు కొట్టుకు పోవడంతో భయంతో ప్రాణాలు గుపెట్లో పెట్టి సాగిస్తున్నారు.ఇదిలా ఉండగా అడ్డుమాండ పంచాయతీ అడ్డుమాండ గ్రామ సమీపంలో కల్వర్టు కోతకు గురైంది. 1980 సంవత్సరంలో కల్వర్టు నిర్మాణం చేపట్టారు. తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2020 నూతన కల్వర్టు ఏర్పాటు చేసినా నాణ్యత లోపంతో కుల్వర్టు కూలి పోయంది. దీంతో, గత్యంతరం లేని పరిస్థితిలో పాత కల్వర్టు మార్గం గుండా ప్రయాణం సాగిస్తున్నారు. ద్విచక్ర వాహనాలే మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. చెక్‌ పోస్టు వెళ్లె ప్రధాన రహదారి ఇది. హుకుంపేట మండలంలోని 3 పంచాయతీలు అడ్డుమండ, గడికించుమండ, భరమసితో పాటు హుకుంపేట, పాడేరు రెండు మండలాల ప్రజలు చోడవరం, వడ్దాది, విశాఖపట్నం నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. కల్వర్టు దెబ్బతిని నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని పలువురు కోరారు.

➡️