కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

మాట్లాడుతున్న వైవి సుబ్బారెడ్డి

ప్రజాశక్తి-అరకులోయ:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.అరకులోయలో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో వైసిపి బలంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. బాక్సైట్‌ జిఒను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే పాడేరులో 500 కోట్లతో మెడికల్‌ కళాశాల మంజూరు చేశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేశారని ఆయన అన్నారు. గిరిజన యువతకు 100 శాతం ఉద్యోగాలు వచ్చే జీవో 3 పునరుద్ధరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు బాక్సైట్‌ తవ్వకం పై దృష్టి పెడితే వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు అండగా నిల బడిందన్నారు.అరకు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అబివృద్ధి చేయడానికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో పథకాలు అందిస్తుందని తెలిపారు. అరకు సమన్వయకర్త రేగమస్యలింగం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అరకు నియోజకవర్గ పరిశీలకు రాలు శోభ హైమావతి దేవి, విశాఖ ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సుభద్ర,పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జిసిసి చైర్మన్‌ శోభా స్వాతిరాణి, ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు లిల్లి సురేష్‌, నాయకులు ,అదిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️