గంజాయి సాగు చేపట్టొద్దు

Jan 25,2024 00:17
మాట్లాడుతున్న ఎఎస్‌పి ప్రతాప్‌శివ కిషోర్‌

ప్రజాశక్తి – చింతపల్లి: శీతల వాతావరణం అన్ని రకాల పంటల సాగుకు అనుకూలమని, ఈ విషయాన్ని ప్రతి రైతు గ్రహించి అక్రమ వ్యాపారం గంజాయి సాగు జోలికి పోవద్దని చింతపల్లి ఏ ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరం వద్ద కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాగులు, వీరవరం గ్రామాలకు చెందిన గిరి రైతులకు పలు రకాల పంటలపై అవగాహన కల్పించారు. అల్లూరి జిల్లాలో గిరిరైతులు సీజనల్‌ పంటలు పండించేందుకు అనువైన వాతావరణం ఉందని, బీసీటీ ద్వారా పలు రకాల పంటలపై పరిశోధనలు చేస్తున్నారన్నారు. రాయితీపై పసుపు, మిరియాలు పొడి చేసే యంత్రాలను, చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. రాజ్మా పంట దెబ్బతింటుందని, పూల సాగు, పండ్లు మొక్కలు తదితర పంటలు ఏలా సాగు చేసుకోవాలని పలువురు రైతులు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీటీ చైర్మెన్‌ శ్రీరామూర్తి, శాస్త్రవేత్త ప్రసాదరావు, ఎల్డీఎం రవితేజ, గూడెంకొత్తవీధి, చింతపల్లి సీఐలు అశోక్‌ కుమార్‌, రమేష్‌, ఎస్సై అరుణకిరణ్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️