గిరిజన పల్లెలు కళకళ

డుంబ్రిగుడలో థింసా నృత్యం చేస్తున్న గిరిజన మహిళలు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: మన్యంలో సంక్రాంతి పండగను గిరిజనులు వైవిధ్యంగా జరుపుకుంటారు. మైదాన ప్రాంతంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ..ఇలా మూడు రోజులు నిర్వహిస్తారు. ఏజెన్సీలో మాత్రం పక్షం రోజులు నిర్వహిస్తారు. గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా రెండు వారాలపాటు వేడుకలను నిర్వహిస్తారు. ఈ పండగ రోజులను గిరిజనలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీలో సంక్రాంతి పండగ తొలిరోజనే గిరిజనులు సైతం భోగి పండుగ జరుపుకుంటారు. పండగలో భాగంగా గ్రామంలోని పాత వస్తువులు, తదితర కర్రలను భోగి మంటలో వేస్తారు. అలాగే భోగిమంట వద్దే నీళ్లను కాచుకుని, వాటితో స్నానమాచరించడం మంచిదనే భావన గిరిజనుల్లో ఉంది. భోగి స్నానాలు చేసిన తర్వాత కొత్త దుస్తులు వేసుకుంటారు. కొత్త కుండలో కొత్త బియ్యం, పప్పులతో పులగం తయారు చేసి గ్రామంలో అందరికీ పంచుతారు. భోగిమంట వేయడం ద్వారా మొదలై గొట్టి పండగ, బారిజంతో ముగిస్తాయి. దీనికోసం ఒకచోట సమావేశం అవుతారు. గ్రామానికి అవసరమైన తలారి, బారిక, పశువుల కాపరిని ఎన్నుకుంటారు. భోగి రోజు నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో డప్పు వాయిద్యాలు, దింస నత్యాలతో సందడి చేస్తారు. దీంతో ఈ పక్షం రోజులు గిరిజన పల్లెలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఇతర గ్రామాల్లోని వారి బంధువులు, స్నేహితులను తమ గ్రామాలకు ఆహ్వానిస్తారు. గిరిజనులు పక్షం రోజులు అటూ ఇటూ పండగ చుట్టాలుగా రాకపోకలు సాగిస్తారు. పండగ ముగిసే వరకు ప్రతిరోజు రాత్రిళ్లు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మహిళలు దింసా నృత్యాలు, పురుషులు డప్పు వైద్యాలతో సందడి చేస్తారు. దీంతో, ఏజెన్సీలోని వారపు సంతలు సైతం జనంతో కళకళలాడతాయి. పండగకు అవసరమైన కొత్త కుండలు, డప్పులు, దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. పండగ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు వారపు సంతలకు వచ్చేటప్పుడే.. తమ వారికి పండుగ కబుర్లు చెబుతుంటారు. అలాగే వారపు సంతలకు సైతం కుటుంబ సమేతంగా వెళుతుంటారు. దీంతో ప్రతి ఏడాది పక్షం రోజులు మన్యంలో పండగ సందడి నెలకొంటుంది.పనిముట్లకు పూజలు..భూమి మీద ఆధారపడి వ్యవసాయంతో జీవనం సాగించే గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించే రోజునే సంక్రాంతిగా భావిస్తారు. దీంతో భోగి మరుసటి రోజు సంక్రాంతి నిర్వహించుకుని తమ పనిముట్లకు పూజలు చేస్తారు. బుడియాల సందడి:మన్యంలో సంక్రాంతి పండగ సందడిలో భాగంగా గిరిజన గ్రామాల్లో పురుషులు జట్టుగా కలిసి వివిధ వేషధారణలతో ఇంటింటికి వెళ్లి ఆటపాటలతో సందడి చేసి పండగ మాములు అడగడం సంప్రదాయం. రెండు వారాలు మన్యంలో యువత బుడియ వేషధారణలతో ఇంటింటికి తిరిగి సందడి చేస్తారు. ఇచ్చిన నగదును బృందం సభ్యులు పంచుకొని పండగ ఖర్చులకు వినియోగించడం గిరిజన ప్రాంతంలో సంప్రదాయంగా కొనసాగుతుంది.సాంప్రదాయ బద్ధంగా సోబోరి ,బుడియాడుంబ్రిగుడ:సంక్రాంతి పండగను ఏజెన్సీలో గిరిజనుల ఆచార, సాంప్రదాయాల బద్ధంగా జరుపుకుంటారు.ప్రాంతాల వారీగా సుమారు మూడు, నాలుగు వారాలపాటు జరుపుకుంటారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా పండగ రోజు గ్రామంలో కుటుంబ సమేతంగా తరలి వచ్చి గ్రామస్తులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి పండుగను జరుపుకుంటారు. పండుగను పురస్కరించుకొని గ్రామ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇద్దరు యువతీ ,యువకులను బూడిద రాసి, విచిత్ర వేషధారణ వేయించి పూజలతో పాటు ఆ ఇద్దరు యువతీ ,యువకులు కూడా మూడు రోజులపాటు ఉపవాసం ఉంటారు. మొదటిరోజు దేవునికి డప్పు వాయిద్యాలతో గ్రామంలోని ప్రతి ఇంటికి నంది దేవునికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.ఆ సమయంలో ఆ గ్రామంలో దొరికిన నాటు కోళ్లను పట్టుకొని తీసుకెళ్ళి పోవడం ఆనవాయితీ. నాటు కోళ్లు పెంచుకునే గిరిజనులు నంది దేవుని ఊరేగింపుగా తీసుకు వస్తున్న రోజున పట్టుకెళ్ళి పోతారనీ ఆ రోజు బయట పంపించకుండా ఇంట్లోనే కోళ్లను దాచుకుని పెట్టుకుంటారు .రెండవ రోజు ఏడాదిలో పండించిన పంటలు తొలి ముద్దగా భావించి పశువులకు నీటిగా స్నానం చేయించి పాలతో పరమాన్నం వండి పశువులకు తినిపిస్తారు. ఆ తర్వాత కుడుములు తయారుచేసి, నాగలి దుంపలు కలిపి పశువులకు మెడలో కడతారు. వాటిని చిన్న పిల్లలు సరదాగా తెంపుకుని తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భావన. పూజలు నిర్వహించి మేకను కోసి, ఇంటింటికి చిన్నచిన్న ముక్కలు కోసి పంచి పెట్టడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. మూడవబ రోజు కుటుంబ సమేతంగా అందరూ కలిసి పిండివంటలు చేసి ఇంటింటికి పంచిపెడుతూ ఆనందంగా గడుపుతారు. ఈ పండగ సందర్భంగా నచ్చిన యువతిని, ఆమెకి ఇష్టమున్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఎత్తుకెళ్లి పోవడం గతంలోనున్న గిరిజనుల సంప్రదాయం.సోబోరి నృత్యం,సేరు బుడ్డి య ప్రత్యేకం :ఈ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని యువతీ,యువకులు మండల పరిధిలో జరిగే వారపు సంతల్లో, గ్రామంలోని కిరాణా దుకాణాల్లో గడపగడపకు ఆడ, మగ వేషధారణ వేసి సోబూరి నృత్యం ప్రదర్శిస్తూ చందా వసూలు చేస్తుంటారు .చిన్నపిల్లలు బూడిద రాసుకొని విచిత్ర వేషధారణతో షేర్‌ బుడియ వసూళ్లు చేస్తుంటారు. వచ్చిన డబ్బులతో గ్రామంలో మూడు రోజుల పాటుగా గిరిజన సాంప్రదాయమైన దింసా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు .చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా కుటుంబ సమేతంగా గ్రామస్తులంతా కలిసి దింసా నృత్యం ప్రదర్శిస్తూ ఆనందంగా గడుపుతారు.ప్రభుత్వ ఉద్యోగులుగా ,వివిధ రంగాల్లో ఉద్యోగులుగా మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా సంక్రాంతి పండగ రోజు తరలివస్తారు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అన్న బేధం లేకుండా అందరూ సమానంగా కలిసిపోయి మూడు రోజులపాటు దింసా నృత్యం ఆడుతారు.

➡️