జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

చెక్కును విడుదల చేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 11,622 మంది విద్యార్ధులకు చెందిన రూ.5,65,09,829లు సంబంధిత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2022 – 23 ఏడాది నాల్గవ విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టరెట్‌ మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువు కోవాలన్నారు. ఏ సమస్యనైనా అధిగమించాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం బిడ్డ పుట్టిన దగ్గర నుండి విదేశీ విద్య వరకు వివిధ పధకాలు అందజేయడం ప్రధాన ఆశయమన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లాలో 390 మంది ఎస్‌సి విద్యార్థులకు రూ.28,27,919లు, 9,669 మంది ఎస్‌టి విద్యార్థులకు రూ. 4,40,04,610లు, 1,173 మంది బిసి విద్యార్థులకు రూ.71,70,505, 108 మంది ఇబిసి విద్యార్థులకు రూ.8,32,914, 233 మంది కాపు విద్యార్ధులకు రూ.12,82,502 మంజూరు అయ్యాయని తెలిపారు. 39 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు రూ.2,64,254, 10 మంది క్రిస్టియన్‌ మైనారిటీ విద్యార్థులకు రూ.1,27,125 జమ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి. అంబేద్కర్‌, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జనార్దనరావు, చింతలవీధి ఎంపిటిసి, సర్పంచ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️