జగన్‌కు ఓటమి భయం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నేతలు

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌:జగన్మోహన్‌ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టీడీపి పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి సివేరి దొన్నుదొర అన్నారు. శుక్రవారం మండలంలోని మాడగడ పంచాయతీ చంపాగూడ గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ నిర్వహించారు. ఈ సందర్భంగా దొన్నుదొర మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన సంయుక్త మేనిఫెస్టో పై అవగాహన కల్పించారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇస్తూ ప్రజలను జగన్‌ మోసం చేశారన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా తెలుగుదేశం అందిస్తుందని పేర్కొన్నారు. మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున నేరుగా వారి ఖాతాలో జమచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాడగడ మాజీ వైస్‌ సర్పంచ్‌ వంతల రాము, పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు, కిల్లో కుమార్‌, త్రినాథ్‌, సుబ్బారావు, వెంకట్రావు, భీమన్న, జగన్‌, వంతల కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️