నేడు మన్యం బంద్‌

పాడేరులో ప్రచారం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ వెంటనే ప్రకటించాలని, జీవో 3కు చట్టబద్ధతకై ఆర్డినెన్స్‌ జారీ చేయాలనే తదితర డిమాండ్లతో ఆదివాసి గిరిజన సంఘం ఈనెల 10న ఆదివారం రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌ కు పిలుపునిచ్చింది. అల్లూరి జిల్లాలో బంద్‌ నిర్వహించేందుకు విద్యార్థి, కార్మిక, ఉపాధ్యాయ, వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. మన్యం బందుకు మద్దతుగా సిపిఎం జిల్లాలో ఐటీడీఏల ఎదుట రెండు రోజులు ముందుగా ఆదివాసి జనరక్షణ దీక్షలు నిర్వహించింది. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యేలోపు ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ వెంటనే ప్రకటించాలని, జీవో 3 చట్టబద్ధతకై ఆర్డినెన్స్‌ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. గిరిజన చట్టాలు, హక్కుల అమల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ఆదివాసీ యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగులు కనీస వేతనాలకు నోచు కోలేక పోతున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌లో పని చేసే గిరిజన ఉద్యోగులకు బాసటగా ఈ మన్యం బంద్‌ జరుగుతోంది.ప్రధాన డిమాండ్లు: ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. ఇందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలి. జీవో 3 చట్టబద్ధతకై టిఏసి ఆమోదించిన నూతన రెగ్యులేషన్‌ ముసాయిదాను ప్రభుత్వం ఆమోదించాలి. మన్యంలో ఆదివాసులకే నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలి. ఆదివాసి మాతృభాష వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలి. ఏపీ ప్రభుత్వ పోర్టల్‌ వెబ్సైట్లో వాల్మీకి, కొండదొర తెగలను పునరుద్ధరించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. నాన్‌ షెడ్యూల్లోని 1500 ఆదివాసి గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలి.

➡️