పాడేరు టిడిపి అభ్యర్థి పై ఉత్కంఠ

టిడిపి అభ్యర్థి

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఎంపికలో ఆ పార్టీ అధిష్టానం చేస్తున్న గోప్యతతో నియోజకవర్గంలో రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతోంది.ఒకవైపు టిడిపి అధిష్టానం పాడేరు అభ్యర్థి ఎంపికపై ఓటర్లకు ఫోన్‌ కాల్స్‌ తో సర్వే చేస్తుండటంతో లువురు ఆశావహుల్లో టిడిపి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్‌ నెలకొంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.ఆమెకే టికెట్‌ కేటాయిస్తారని ప్రచారం ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పలువురు యువ నాయకులు, సీనియర్లు కూడా పాడేరు టిడిపి టికెట్‌ ఆశిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇందులో ప్రధానంగా పాడేరు టిడిపి మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి చిట్టి నాయుడు కుటుంబానికి చెందిన కొట్టగుల్లి సుబ్బారావు, టిడిపి మాజీ ఎమ్మెల్యే తనయుడు ఎం.ప్రసాద్‌రావు, పాడేరు మాజీ సర్పంచ్‌ ఇల్లు వెంకటరత్నం తనయుడు రమేష్‌ నాయుడు, పాడేరు టిడిపి ఆశావహులుగా ఉన్నారు. తమకే టిక్కెట్‌ వస్తుందని ఆశాభావంతో పార్టీ శ్రేణులను సమీకరిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాకుండా ప్రచార పర్వం కూడా మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని టిడిపి ముఖ్య నేతల్లో అనైక్యత తో పాటు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరితో ముఖ్య నేతలు కొందరు మొదట్నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో కూడా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకు వెళ్లినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఈశ్వరి తాను ఒంటరిగానే పార్టీ కార్యక్రమాలు నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక దశలో ఆమెకు టిక్కెట్‌ విషయంలో పోటీ కూడా లేని పరిస్థితి ఉండేది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపితో పొత్తు ఉన్న జనసేన, బీజేపీ పార్టీలు కూడా పాడేరు టికెట్ను ఆశిస్తున్నాయి. నియోజకవర్గంలో జనసేన, బీజేపీ కంటే టిడిపి అన్ని మండలాల పంచాయతీల్లో కేడర్‌ బలంగా ఉంది.

➡️