కవిత్వాన్ని ప్రజాస్వామీకరించిన శ్రీ శ్రీ

Jun 16,2024 16:37 #Kakinada, #sri sri jayanthi, #utf ofice
  • ప్రజా సంఘాలు నిర్వహించిన శ్రీ శ్రీ స్మరించుకుందాం కార్యక్రమంలో అద్దేపల్లి ప్రభు

ప్రజాశక్తి-కాకినాడ : కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడం, కష్టజీవుల పక్షాన నిలబడడం శ్రీ శ్రీ వల్లనే సాధ్యం అయ్యిందని అద్దేపల్లి ప్రభు కొనియాడారు. యుటిఎఫ్ హోంలో శ్రీ శ్రీ 41 వ వర్ధంతి సందర్భంగా శ్రీ శ్రీని స్మరించుకుందాం అనే కార్యక్రమం నిర్వహించారు. యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ నేడు అనే అంశంపై అద్దేపల్లి ప్రభు మాట్లాడారు. సాధారణ ప్రజలు కూడా శ్రీ శ్రీ కవితలు చదివి స్ఫూర్తి పొందుతారన్నారు. కవిత్వాన్ని ప్రజాస్వామీకరించడం లో, కష్టజీవుల పక్షాన నిలబడడం లో శ్రీ శ్రీ మరొక సాటి లేరన్నారు. రాజకీయ చైతన్యం, మార్క్సిజం తో కొనసాగడం శ్రీ శ్రీ ప్రత్యేకత గా గుర్తించాలన్నారు. శ్రీ శ్రీ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుందన్నారు. జి‌. ప్రభాకర వర్మ మాట్లాడుతూ ఆకాశంలో విహరిస్తున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన ఘనత శ్రీ శ్రీ కే దక్కుతుందన్నారు. జెవివి జిల్లా అధ్యక్షుడు కెఎంఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం నాయకులు కె. సత్తిరాజు, ఆవాజ్ కన్వీనర్ ఇబ్రహీం తదితరులు శ్రీ శ్రీ కవితలు చదివి వినిపించారు. ముందుగా జెవివి రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి పలివెల వీరబాబు స్వాగతం పలుకగా వి. శ్రీరామారావు వందన సమర్పణ చేశారు.

➡️