పివిటిజి గ్రామాల అభివృద్ధికి కృషి

కార్డులను ఇస్తున్న మనోజ్‌కుమర్‌సింగ్‌

కేంద్ర గిరిజన వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ప్రజాశక్తి- అరకు లోయ:ప్రధాన మంత్రి జన జాతి అదివాసీ న్యాయ మహా అభియాన్‌ పథకంతో అదివాసీ (పివిటిజి) గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించి సంపూర్ణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. శుక్రవారం అరకులోయ మండలం కొత్తభల్లు గూడ గ్రామంలో జరిగిన జన్‌ మన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పివిటిజి గ్రామాల గిరిజనులకు ఉచితంగా ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.సమగ్ర గిరిజనాభివద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్‌ మాట్లాడుతూ, ఆదివాసి గ్రామాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పాడేరు ఐటిడిఏ పరిధిలో 1597 పివిటిజి గ్రామాలలో సమగ్రమైన సర్వే చేసి నమోదు చేయడం జరుగుతుందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడానికి ప్రతిష్టాత్మకంగా పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.అర్హత కలిగిన లబ్దిదారులు పథకాలు పొందడానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్‌. ప్రభాకర్‌, ఎం.వేంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పిడి బి. బాబు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ లీలా కృష్ణ, తహాసిల్దార్‌ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

➡️