ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం

శిక్షణకు హాజరైన వైద్యులు, సిబ్బంది

ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ బాషా సూచించారు. బుధవారం డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో కేర్‌ క్యాంపెనియన్‌ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జమాల్‌ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కేర్‌ క్యాంపెనియన్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కమ్యూనిటి స్థాయిలో ప్రజల ఆరోగ్యం, అపోహలు, భయాందోళనలు పోగొట్టే విధంగా కమ్యూనిటీ హెల్త్‌ అధికారులకు అందిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌, ప్రసవానికి ముందు, తరువాత, హై రిస్క్‌ గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కేర్‌ కాంపేనియన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ జయా భార్గవి మాట్లాడుతూ, మన జిల్లాలో ఉన్న 187 మంది సిహెచ్‌ఓలకు నాలుగు బ్యాచ్‌లుగా శిక్షణ అందిస్తున్నామని వివరించారు.

➡️