మాట ఇచ్చి..మడం తిప్పి

ఆందోళన చేపడుతున్న ఉద్యోగులు (ఫైల్‌ పొటొ)

పతిపక్ష నేతగా జగన్‌ ఉద్యోగులకు తియ్యని మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక.. డిఎ బకాయిలు, పెండింగ్‌ బిల్లులు చెల్లించ లేదు. సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ అమలు చేస్తానని వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్‌ సి, డిఎలతో పాటు మరి కొన్ని ఆర్థిక బకాయిలు చెల్లించలేదు. చివరికి ఉద్యోగులు దాచుకున్న ఎ పిజిఎల్‌ఐ, పిఎఫ్‌ సొమ్ము కూడా ఈ ప్రభుత్వం వాడుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పోరాటాలతో రద్దు చేయించిన అప్రెంటిస్‌ విధానం తిరిగి అమలుకు నిర్ణయం, సిపిఎస్‌ రద్దు చేయకపోవడం, ఆర్థిక ప్రయోజనాలను కల్పించకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమస్యలపై ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై నిర్భందాలు ప్రయోగిస్తుంది. ప్రశ్నించినా, ఆందోళన చేసినా, నిరసన తెలిపినా కేసులతో భయపెడుతోంది.ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఎపిలో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జీతం సమయానికి రాదు ఆర్థిక ప్రయోజనాలకు నెలల కొద్ది నిరీక్షించాల్సిన దుస్థితి. సమస్యలపై నిరసన తెలుపుదామంటే ఆంక్షలు, కేసులు, నిర్బంధాలు, కక్ష సాధింపులు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతం వస్తుందనుకునే రోజులు పోయాయి. రిటైర్‌ మెంట్‌ బెనిఫిట్స్‌ ఎప్పుడొస్తుందో తెలియదు. తమ ప్రయోజనాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలు సైతం ఇవ్వకుండా తమను మానసికంగా వేధిస్తోందని రగిలిపోతున్నారు.ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రతిసారీ చర్చల పేరుతో పిలవడం, హామీలు గుప్పించడం, వాటిని నెరవేర్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. పాత వాయిదాల పరిస్థితి గురించి స్పష్టత ఇవ్వకుండా కొత్తగా వాయిదాలు వేయడం చూస్తుంటే ఉద్యోగుల సమస్యల విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. సర్కారు తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి దుస్థితి ఎప్పుడు చూడలేదని అంటున్నారు. 12వ పిఆర్‌సి కమిషన్‌ వేసినప్పటికీ ఏమాత్రం ప్రగతి లేదని మండిపడుతున్నారు. గతేడాది జూలై 1 నుంచి 12వ పిఆర్‌సి అమలు కావాల్సి ఉన్నా నేటికీ అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగులు తమ సొంత డబ్బును వాటాగా కడుతూ పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ లోన్లు, పార్ట్‌ ఫైనాన్స్‌ కోసం చేసుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగుల బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌ లో ఉన్నాయని ఇలాంటి దుస్థితి ఎప్పుడూ లేదని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️