డెంగీ, మలేరియాపై అప్రమత్తత

డెంగీ, మలేరియాపై అప్రమత్తత

నగరంలో పెరుగుతోన్న పాజిటివ్‌ కేసులు

ప్రజా సహకారంతోనే నియంత్రణ సాధ్యం

జిల్లా మలేరియా నిర్మూలనాధికారి డాక్టర్‌ తులసి

ప్రజాశక్తి- సీతమ్మధార : డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం అవసరమని జిల్లా మలేరియా నిర్మూలనాధికారి డాక్టర్‌ తులసి అన్నారు. బుధవారం రామాటాకీస్‌ దరి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ పి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడుతూ, నగరంలో ఇప్పటివరకు 202 మలేరియా, డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీజనల్‌ జ్వరాలు, కీటక జనిత డెంగీ, మలేరియా వంటి వ్యాధులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి ఆవరణలో, సన్‌సైడ్‌, టెర్రాస్‌పై మంచి, మురుగునీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు సెప్టిక్‌ ట్యాంకులు, ఖాళీ గొట్టాలకు నైలెన్‌ జాలీని కట్టుకోవాలన్నారు. దోమలు, వాటి లార్వాలు వృద్ధి చెందకుండా, అవి కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించరాఉ. నిద్రించేటప్పుడు దోమతెరలు తప్పకుండా వాడాలని, పగటిపూట చేతులు, కాళ్లకు నిండుగా ఉండే దుస్తులు వేసుకోవాలని సూచించారు. చీకటి పడకముందే తలుపులు, కిటికీలు మూసేయడం ద్వారా దోమలు ఇంటిలోకి రాకుండా నివారించవచ్చన్నారు నగరంలో డెంగీ, మలేరియాపాజిటివ్‌గా నిర్థారణ జరిగిన రోగులకు దగ్గరలోని యుపిహెచ్‌సిలో చికిత్స అందిస్తున్నామని, జ్వరలక్షణాలు, నీరసంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి, వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెంగీ, మలేరియాపై ప్రజలకు శాఖాపరంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో వైద్యులు డాక్టర్‌ జీవన్‌రాణి డాక్టర్‌ సుమిత, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిఎంఒ డాక్టర్‌ తులసి

➡️