మెగా పేరుతో దగా

Feb 1,2024 23:13
నిరుద్యోగులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: పాదయాత్రతో పాటు గత శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పలుమార్లు హామీలు గుప్పించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ విడుదల చేస్తామని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ విడుదల చేయలేదు. టీచర్‌ పోస్టుల భర్తీని నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగ యువతకు వల వేసేందుకు తాజాగా మంత్రి మండలిలో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయించడంతో వైసిపి ప్రభుత్వం దగాకు గురి చేసినట్లేనని నిరుద్యోగ యువత మండిపడుతోంది. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి డీఎస్సీ నోటిఫికేషన్‌ అంటూ మభ్యపెడుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6100 పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించడం నిరుద్యోగుల ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు కుమ్మరించింది. ఉన్న ఖాళీలను 117 జిఒ ముసుగులో కుదించేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి తగ్గించారు. ప్రతిపక్షంలో ఉండగా 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్‌ ప్రకటనలు చేశారు. వైసిపి ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో 18,520 ఖాళీలు ఉన్నట్లు తేల్చింది. కానీ 8,366 మాత్రమే అవసరమని ఇప్పుడు 6,100 టీచర్‌ పోస్టులకు కుదించింది. జగన్‌ హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీ వేసి ఉంటే కొంతమేర న్యాయం జరిగేదని, కనీసం 10వేల పోస్టులైన ఇచ్చి ఉండాల్సిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అప్రెంటిస్‌ విధానం..కొత్తగా నియమితులయ్యే ఉపాధ్యాయులకు అప్రెంటిస్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో ఈ విధానం ఉండేది. ఉద్యోగముల చేరిన మొదటి సంవత్సరం రూ.1200, రెండో సంవత్సరం రూ.1500 వేతనం ఇచ్చేవారు. మూడో సంవత్సరంలో అప్రెంటీస్‌ ముగుస్తుంది. అప్పటినుంచి రెగ్యులర్‌ వేతనం ఇచ్చేవారు. తరువాత ఈ విధానం రద్దు చేశారు. తాజాగా మళ్లీ అప్రెంటిస్‌ విధానం పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️