యుటిఎఫ్‌ ఆధ్వర్యాన నిరసన ర్యాలీ

Jan 25,2024 00:14
పాడేరు, చింతూరులో ఆందోళనలు చేపడుతున్న యుటిఎఫ్‌ నేతలు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-పాడేరు: ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి జీతభత్యాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు లోని అంబేద్కర్‌ సెంటర్‌ నుండి ఆర్‌.టి.సి. కాంప్లెక్స్‌ వరకు యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతభత్యాలు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ రుణాలు, పార్ట్‌ పైనల్‌, సరెండర్‌ లీవులు విడుదల చేయాలని, డిఎ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఐటీడీఏ వద్దకు ర్యాలీగా చేరుకున్న ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం చాలా విచారకరమని తెలిపారు. దీంతో, మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిరసన చేపట్టడం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతో ప్రభుత్వం స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉందని చెబుతూ మోసం చేస్తోందని విమర్శించారు. సెప్టెంబర్‌ నెలలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని, 5 నెలలు గడిచినా మీన మేషాలు లెక్కిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి జీతభత్యాలు చెల్లించకుంటే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు సిహెచ్‌ నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి యం.ధర్మారావు, పి.దేముడు, ఆడిట్‌ కమిటీ సభ్యులు కె.రఘునాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కళారావు, గంగాధర్‌, కర్రి బాబు, ఎస్‌ కన్నయ్య, రాజారావు, బాలకృష్ణ, ఆనంద్‌, సతీష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చింతూరు:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చింతూరు తహశీల్దారు కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పండా కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం బకాయిపడిన ఏపీజిఎల్‌ఐ, పిఆర్‌సి, డిఎ, సరెండర్‌ లీవ్స్‌ బకాయిలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే సిపిఎస్‌ రద్దు చేస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. జనవరి 28న రాజమండ్రిలో జరిగే పాత పెన్షన్‌ సాధన సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాలుగు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొగ్గ ముత్తయ్య, ఎం.సోమరాజు, ఎన్‌ జగదీష్‌, ఎం రామకృష్ణ, పి రాజారావు, ఎం విజయ, కళ్యాణి, అప్పారావు, బ్రహ్మయ్య, నాగయ్య, బాబురావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️