రెండో రోజుకు యుటిఎఫ్‌ రిలే దీక్ష

Feb 2,2024 22:58
నినాదాలు చేస్తున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-పాడేరు: ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించిందని యుటిఎఫ్‌ జిల్లా సహా అధ్యక్షులు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక బకాయిల్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో ఐటిడిఎ కార్యాలయం ముందు చేపట్టిన రిలే దీక్ష శుక్రవారం రెండో రోజు కొనసాగించారు. మండలాల యుటిఎఫ్‌ నాయకులు రిలే దీక్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఆర్థిక బకాయిలన్నీ ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి యం. ధర్మారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఆనాడు పాదయాత్రలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు గుప్పించి అధికారం దక్కించుకుని నేడు ఇచ్చిన హామీలు అమలు జరపాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే కనీసం మాటనైన మాట్లాడకపోవడం తగదని అన్నారు. జి.మాడుగుల మండల అధ్యక్షుడు ఎస్‌.గంగాధర్‌ మాట్లాడుతూ, కరువు భత్యాలకు ఇన్కమ్‌ టాక్స్‌ చెల్లించడం ఈ ముఖ్యమంత్రి హయాంలో చూసామన్నారు. తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుండి లోన్లు చెల్లించ లేదని జిల్లా కార్యవర్గ సభ్యులు గల్లేల.సతీష్‌ అన్నారు. ఈ రోజు రిలే నిరాహారదీక్షలో యం.శ్రీను, ఈశ్వరరావు నాయుడు, సింహాచలం, ధనుఫతి, కె.ఆనంద్‌, చిన్నయ్య, గోవింద్‌, జయకృష్ణ, అవినాష్‌, గణేష్‌ , చిరంజీవిలు పాల్గొన్నారు.

➡️