వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలి

మాట్లాడుతున్న అప్పలనాయుడు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:వికలాంగుల పింఛన్‌ ను రూ.6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. ఎన్‌పిఆర్‌డి అరకు నియోజకవర్గం సమావేశం బుధవారం స్థానిక ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 25 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, వికలాంగుల చట్టం అమలు కాకపోవడంతో భద్రత కరువైందని తెలిపారు. సంక్షేమ పథకాల్లోనూ పాలకులు కోతపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులపై నేటికీ వివక్షత కొనసాగుతోందని తెలిపారు.ఇటువంటి తరుణంలో అన్ని విధాలుగా తమ పక్షాన నిలిచే వారికే ఎన్నికల్లో వికలాంగుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల చట్టం 2016ను పటిష్టంగా అమలు జరపాలని కోరారు. అన్ని రకాల బస్సు సర్వీసుల్లో వికలాంగులు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని,బడ్జెట్‌లో ఐదు శాతం నిధులు కేటాయించాలని కోరారు.వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా పూర్తి సబ్సిడీతో రూ.పది లక్షల రుణం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు వెంకటరావు, కేశవ్‌, పాల్గొన్నారు..

➡️