సమ్మె శిబిరాల్లో క్రిస్మస్‌ వేడుకలు

రాజవొమ్మంగిలో కేకు కట్‌ చేస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-చింతూరు : అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటానని నమ్మబలికి, నేడు అంగన్వాడీలను రోడ్డెక్కేలా చేసిన సిఎం జగన్‌కు, వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి పి.వెంకట్‌ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 14వ రోజుకు చేరిన సందర్భంగా సోమవారం క్రిస్మస్‌ రోజున సమ్మె శిబిరాల్లోనే కేక్‌లను కట్‌చేసి, అంగన్వాడీలు నిరసన చేపట్టారు. అంగన్వాడీల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండివైఖరి సరికాదన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బందిని కాపలా పెట్టారని, రేపటినుంచి మున్సిపల్‌ కార్మికులు సమ్మెబాట పడుతున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయిస్తారాయని ప్రశ్నించారు. నియంత పోకడలను మాని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్‌, సిఐటియు చింతూరు మండల కార్యదర్శి పొడియం లక్ష్మణ్‌, అంగన్వాడీ కార్మికులు వెంకటరమణ, జయ, చిట్టమ్మ, కిట్టమ్మ, సత్యవతి, దుర్గ, విజయ, నూకరత్నం, లక్ష్మి. పాల్గొన్నారు. విఆర్‌. పురం : అంగన్వాడీల సమ్మెపై పభుత్వ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ దీక్షాశిబిరాల్లో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం. సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు సున్నం రంగమ్మ, మండల కార్యదర్శి రాజేశ్వరి మద్దతుగా దీక్షల్లో పాల్గొని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు, మండల కార్యదర్శి నాగమణి పాల్గొన్నారు. సీలేరు: సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టి, క్రిస్మస్‌ పండుగ రోజున కుటుంబాలను వదిలి అంగన్వాడీలంతా రోడ్డుపైన దీక్షలు చేస్తుంటే, ముఖ్యమంత్రి జగన్‌, వైసిపి నేతలు కుటుంబాలతో పండుగ వేడుక చేసుకుంటున్నారని సిఐటియు నేత వెంకట్‌ ఆక్షేపించారు. అంగన్వాడీల దీక్షలు 14వ రోజుకు చేరిన నేపథ్యంలో సోమవారం దీక్ష శిబిరంలో కేకు కట్‌ చేసి క్రిస్మస్‌ పండుగను జరుపుకోవడం ద్వారా అంగన్వాడీలు నిరసన చేపట్టారు. రాజవొమ్మంగి : స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహం వద్ద ఏర్పాటుచేసిన అంగన్వాడీల సమ్మె శిబిరంలో సోమవారం కేకు కట్‌చేసి నిరసన చేపట్టారు. అంగన్వాడీల యూనియన్‌ మండల కార్యదర్శి కె వెంకటలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు, సిహెచ్‌కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం మొద్దునిద్ర వీడి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌కు యేసుక్రీస్తు మారు మనసు ప్రసాదించి, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా కనువిప్పు కలిగించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎల్‌.సత్యవతి, నూకరత్నం, రత్నం, రాజేశ్వరి, రాధ, రమణి, సుందరమ్మ, మంగ పాల్గొన్నారు.సిఐటియు ఆధ్వర్యంలోకొవ్వొత్తులతో ర్యాలీ రంపచోడవరం : అంగన్వాడీల సమ్మె 14వ రోజున క్రిస్మస్‌ సందర్భంగా దీక్ష వేదిక వద్ద కేకు కట్‌ చేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు వెలిగించిన కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి, అక్కడ మానవహారం నిర్మించారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నిరసన నినాదాలు చేశారు. యూనియన్‌ జిల్లా కోశాధికారి కె.రామలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మెట్ట వాణిశ్రీ పాల్గొన్నారు. అనంతగిరి:ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ముందుగా క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్‌ కార్యాలయం ఆరు బయట వద్ద వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలను ఉదృతం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ వెల్ఫేర్‌ నాయకురాలు సిహెచ్‌ కళావతి, పి.మంజుల పాల్గొన్నారుబిజెపి నేతలకు నిరసన సెగపెదబయలు:మండల కేంద్రంలో అంగన్వాడీల నిరసన 14వ రోజుకు చేరింది. సంఘం అధ్యక్షురాలు టి.రాజమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీలు క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం టి.రాజమ్మ మాట్లాడుతూ, కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. బిజెపి నేతలకు నిరసన సెగస్థానిక బిజెపి నాయకులు మద్దతివ్వడానికి రాగా వ్యతిరేకించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా అంగన్వాడీలకు సుప్రీం కోర్టు ఆదేశాను ప్రకారం నెలకు రూ.26 వేలు ఇప్పించండి అప్పుడే మా దగ్గరకు రండని నిలదీయడం తో చేసేది లేక వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సన్నిబాబు, మండల కమిటీ నాయకులు కె.శరబన్న, బోండా గంగాధరం, జంపరంగి సునీల్‌ కుమార్‌, అంగన్వాడీ హెల్పర్స్‌ యూనియన్‌ పద్మ, సుశీల, కొండమ్మ పాల్గొన్నారుముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని అంగన్వాడీల సమ్మె 14వ రోజుకు చేరింది. గిరిజన మహిళ సంఘం (ఐద్వా) మండల అధ్యక్షులు ఈశ్వరి, కార్యదర్శి విజయ, మండల కమిటీ సభ్యులు సమ్మెకు మద్దతు తెలిపారు. విద్యుత్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా సభ్యులు కే.సత్తిబాబు అంగన్వాడి సమ్మెను సందర్శించి సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొర్ర త్రినాథ్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం ఎం శ్రీను, సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు, సిపిఎం కార్యదర్శి భీమరాజు రామదాసు, ఐద్వా మండల కమిటీ సభ్యులు మీనా, రాధమ్మ, అంగన్వాడి వర్కర్స్‌ మండల నాయకులు సత్యవతి, మావులమ్మ, ఈశ్వరమ్మ, కాంతమ్మ పాల్గొన్నారు.డుంబ్రిగుడ: సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె మండలంలో కొనసాగుతుంది. సోమవారం మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంక్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కే.కొండమ్మ, కే.సత్యవతి, అంగన్వాడీలు, హెల్పర్లు, పాల్గొన్నారు.

➡️