సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

మాట్లాడుతున్న కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం బలపరిచిన అభ్యర్థులను అరకు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. బుదవారం అరకువేలి మండల సిపిఎం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ఆదివాసుల హక్కులు, చట్టాల రక్షణకై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. గిరిజన ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. పోడు పట్టాల సాధనకు, మంచినీరు, రోడ్డు, గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలకు సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. జివో 3కి చట్టబద్ధత, 100శాతం ఉద్యోగ అవకాశాలు, 1/70 చట్టం పట్టిష్టంగా అమలు చేయాలని దశలవారీగా అనేక పోరాటాలు చేస్తుందని తెలిపారు.గిరిజన ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపితో భవిష్యత్తులో ముప్పు ఉందన్నారు. వైసిపి, జనసేన, టిడిపి పార్టీలు బిజెపికే మద్దతు పలుకుతూ గిరిజనులకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపించాలని పిలుపునిచ్చారు. ప్రచారం చేసి ఆదివాసి గిరిజనుల్లో చైతన్యం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కిండంగి రామారావు, వివి జయ, సుంకరమెట్ట సర్పంచ్‌ గెమ్మేలి చిన్నబాబు, పద్మాపురం ఉపసర్పంచ్‌ జన్ని బాగత్‌ రామ్‌, సిపిఎం మండల కమిటీ సభ్యులు గత్తుం బుజ్జిబాబు, పి.బాలదేవ్‌, పాంగి రామన్న, కె.మొద్దు, టి.జోషి, అప్పన్న, కొగేష్‌, అప్పలస్వామి, సిహెచ్‌ గురుమూర్తి పాల్గొన్నారు.

➡️