సెక్టార్‌ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి

మాట్లాడుతున్న కలెకటర్‌

ప్రజాశక్తి పాడేరు : సార్వత్రిక ఎన్నికలను విజయ వంతం చేసే బాధ్యత సెక్టార్‌ అధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అరకు నియోజక వర్గం సెక్టార్‌ అధికారులకు నియోజవర్గం స్థాయి మాస్టర్‌ ట్రైనీలకు పోలింగ్‌ ప్రక్రియ, ఈవిఎంల ఏర్పాటు, సెక్టార్‌ అధికారుల బాధ్యతలు, విధులపై మంగళవారం మూడవ విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, పోలింగుకు ముందు, తరువాత నిర్వహించ వలసిన ప్రక్రియలో సెక్టార్‌ అధికారులు సమర్దవంతంగా పనిచేయాలని సూచించారు. పోలింగ్‌ రోజున ఈవి ఎంల నిర్వహణ, అనంతరం స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలింపుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో బాధ్యతా రాహిత్యం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి లోటు పాట్లుంటే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందించాలని చెప్పారు. పోలింగ్‌ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈవిఎంలు సక్రమంగా పోలింగ్‌ అధికారులకు అందిందీ లేనిదీ క్షణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. కంట్రోల్‌ యూనిట్‌, వివి పాట్‌, బ్యాలెట్‌ యూనిట్లను సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి మ్యాపింగ్‌ చేసిన యంత్రాలు వచ్చిందీ లేనిది సరిచూసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజు ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ ఏజెంట్లకు ముందుగానే సమాచారం అందించాలని చెప్పారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొన్నారు. ప్రతీ రెండు గంటలకు పోలింగ్‌ పర్సంటేజ్‌ వివరాలు, పోలింగ్‌ జరుగుతున్న తీరుపై జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిష్ట్‌, అరకు నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, డిఆర్‌ఓ పద్మావతి, ఎస్‌సిలు వివిఎస్‌.శర్మ, పి.అంబేద్కర్‌, అరకు నియోజక వర్గం సెక్టార్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️