1/70 చట్టానికి తూట్లు

Apr 8,2024 23:14
జ్యోతి థియేటర్‌ ఎదురుగా గిరిజనేతరులు నిర్మిస్తున్న షాపులు

ప్రజాశక్తి -అరకులోయ : పర్యాటక కేంద్రమైన అరకులోయ, ఎండపల్లి వలసలో 1/ 70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలతో పాటు బహుళ అంతస్తులు, షాపులపై షాపులు నిర్మిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో సంబంధిత అధికారులు ఎన్నికల బిజీలో ఉండటంతో ఇదే అదునుగా భావించిన కొంతమంది గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ అధికారులు, వీఆర్వోలు, కార్యదర్శులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా పెరిగి పోతున్నాయి. రోడ్లపైనే బహుళ అంతస్తులు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో అధికారుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అరకులోయ సమీపంలోని ఎండపల్లి వలస, జ్యోతి థియేటర్‌ ఎదురుగా డుంబ్రిగూడ మండలానికి చెందిన గిరిజనేతరులు బినామీ పేర్లతో అనుమతులు లేకుండా దర్జాగా షాపులపై షాపులు నిర్మిస్తున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అక్రమ నిర్మాణాలు అరికట్టాలని ఎన్నిసార్లు సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు, పంచాయతీ అధికారులకు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఫిర్యాదులు చేసినా కనీసం చలనం లేకపోవడం గమనార్హం. 1/ 70 చట్టం ఉన్నా గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఎందుకు మౌనం దాలుస్తున్నారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌, పాడేరు ఐటిడిఏ పి ఓలు దృష్టి సారించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.

➡️