మండుటెండలో ఉపాధి హామీ పనులు

Apr 7,2024 23:51
ప్రచారం చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఉపాధి హామీ పనులు చేపడుతున్న పని ప్రదేశంలో కూలీలకు కనీస మౌలిక సౌకర్యాలు లేక మండుటెండలో పనులు చేస్తున్నారు. దీంతో, ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేపడుతున్న పని ప్రదేశంలో టెంట్‌, తాగునీరుతో పాటు ప్రధమ చికిత్స మెడికల్‌ కిట్టు, వేసవిలో మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పని ప్రదేశంలో ఇటువంటి సౌకర్యం కల్పించలేదు. దీంతో ఉపాధి కూలీలు మండు టెండల్లోనే పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో నీడ సౌకర్యం లేక ఉపాధి కూలీలు ఎండల్లో మండుతూ పనులు చేపడుతున్నారు. గతంలో పని ప్రదేశంలో టెంట్‌, మంచినీరు, ప్రధమ చికిత్స కిట్టుతో పాటు చిన్న పిల్లలను ఆడించడానికి ఆయా వంటి సౌకర్యాలను కల్పించేవారు ప్రస్తుతం అటువంటి సౌకర్యాలు కల్పించ లేదని పలువురు ఉపాధి కూలీలు అంటున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఎండల్లో పనిచేస్తూ ఉపాధి కూలీలు వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేటప్పుడు ప్రమాదవశాత్తు పనిముట్లు తగిలి గాయాలైన వడదెబ్బకు గురైన వెంటనే మెడికల్‌ కిట్లు లేక ప్రధమ చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఉందని ఉపాధి కూలీలు అంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పని ప్రదేశాలను సౌకర్యాలు కల్పించాలని మండలంలోని ఉపాధి కూలీలు కోరుతున్నారు.

➡️