అరకు, పాడేరులో పలువురు నామినేషన్లు

Apr 20,2024 00:26
నామినేషన్లు

పాడేరు: పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి శుక్రవారం వైసీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు, టిడిపి అభ్యర్థి కిల్లు వెంకట రమేష్‌ నాయుడు తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. టిడిపి అభ్యర్థి రమేష్‌ నాయుడు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టర్‌ కార్యాలయానికి తరలి వెళ్లారు.పాడేరు వైసిపి, టిడిపి అభ్యర్థుల నుంచి పాడేరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి భావన వశిష్ట నామినేషన్లను స్వీకరించారు.నామినేషన్ల స్వీకరణ రెండవ రోజు అరకు అసెంబ్లీ నియోజక వర్గానికి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ పి.ఓ వి. అభిషేక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బి ఎస్పీ పార్టీ అభ్యర్దిగా లకే రాజారావు ఒక నామినేషన్‌, బి.జె.పి అభ్యర్ది పాంగి రాజారావు రెండు సెట్లు నామినేషన్లు వేసారు. స్వతంత్ర అభ్యర్థులు సమిర్డి రఘునాధ్‌, సమిర్డి గులాబి, సివేరి అబ్రహాం ఒక్కొక్క సెట్టు నామినేషన్లు దాఖలు చేసారు. రెండో రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఐటీడీఏ కార్యాలయంలో సాగిన ప్రక్రియలో అభ్యర్ధుల నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌కు అందజేశారు.వైసిపి అభ్యర్థి విశ్వేశ్వరరాజు నామినేషన్‌వైసిపి పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులతో శుక్రవారం అట్టహాసంగా తరలివచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్‌ సభ్యులు గొడ్డేటి మాధవి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. పాడేరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మత్స్యరాస వెంకటలక్ష్మి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ తమర్బ నర్సింగరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు పీలా వెంకటలక్ష్మి హాజరయ్యారు.టిడిపి అభ్యర్థి శిరీషాదేవి నామినేషన్‌ దాఖలుప్రజాశక్తి-రంపచోడవరం రంపచోడవరం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా రంపచోడవరంలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్స్‌ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుండి సంప్రదాయ కొమ్ములు నృత్యాలు, డీజే వాయిద్యాలు మధ్య భారీగా బాణసంచా పేల్చుతూ ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మిరియాల శిరీషా దేవి తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ దళితులను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం టిడిపి పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్‌, మాజీ శాసనసభ్యులు చిన్నబాబు రమేష్‌, మటన్‌ భాస్కర్‌, 11 మండలాలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️