పోలింగ్‌ను విజయవంతం చేయాలి

Apr 8,2024 23:15
అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను విజయవంతం చేసే బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారులపైనే ఉందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. స్థానిక ఎపి గురుకుల కళాశాలలో అరకు నియోజకవర్గం హుకుంపేట, పాడేరు నియోజక వర్గం పాడేరు మండలాల ప్రీసైడింగ్‌ అధికారులకు శనివారం నిర్వహించిన మొదటి విడత ఒక రోజు శిక్షణకు జిల్లా కలెక్టర్‌ హాజరయ్యారు. శిక్షణా తరగతి గదులను సందర్శించిన కలెక్టర్‌ ప్రీసైడింగ్‌ అధికారులతో మాట్లాడుతూ, ఈఎంలు, వివి పాట్‌, కంట్రోల్‌ యూనిట్‌, 17ఎ రిజిష్టరు నిర్వహణపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అన్నీ తెలుసని అనుకోకుండా ప్రతీ అంశాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై పంపిణీ చేసిన పుస్తకాలను క్షణ్ణంగా పదే పదే చదవాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తు న్నామనే విషయం గుర్తించుకుని పని చేయాలని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని స్పష్టం చేసారు.పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిస్ట్‌ ముందుగా అసెంబ్లీ స్థాయి మాష్టర్‌ ట్రైనర్లతో (ఎ.ఎల్‌.ఎం.టిలు) సమావేశం నిర్వహించారు. ప్రిసైడింగ్‌ అధికారులకు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి సంపూర్ణ విషయ పరిజ్ఞానాన్ని అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ రూపొందించిన మొబైల్‌ యాప్‌లపై తగిన విధంగా శిక్షణ అందించి అవగాహన పెంచాలని తెలిపారు.పోలింగ్‌ కేంద్రాలలో రహస్య పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. అరకు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సెక్టార్‌ అధికారుల వద్ద రెండు ఈవిఎం పరికరాలను రిజర్వులో ఉంచుతామని, అవి పనిచేయకుంటే వెంటనే మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వి. వి.ఎస్‌. శర్మ, తహశీల్దార్లు కల్యాణచక్రవర్తి, సోమేశ్వరరావ, మాస్టర్‌ ట్రెయినీలు పాల్గొన్నారు.

➡️