జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

May 6,2024 00:09
అరకులోయలో ఓటింగ్‌ను పరిశీలిస్తున్న పిఒ

ప్రజాశక్తి -పాడేరు: జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బంది 1222 మంది తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆదివారం వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. విజయ సునీత తెలిపారు. మరో 68 మంది 85 సంవత్సరములు పైబడిన వయసు గల ఓటర్లు, పిడబ్ల్యుడి ఓటర్లు హౌమ్‌ ఓటింగ్‌ను వినియోగించుకున్నారని తెలిపారు. అరకు వ్యాలీ నియోజకవర్గం లో 288 మంది పోస్టల్‌ బ్యాలెట్‌, పాడేరు నియోజకవర్గంలో 387 మంది పోస్టల్‌ బ్యాలెట్‌, 37 మంది హౌమ్‌ ఓటింగ్‌, రంపచోడవరం నియోజకవర్గం లో 547 మంది పోస్టల్‌, 24 మంది హౌమ్‌ ఓటింగ్‌ ద్వారా తమ ఓటు హక్కును విని యోగించుకున్నారని కలెక్టర్‌ వివరించారు.అరకు లోయ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 288 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకున్నారని అరకు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్‌ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగు ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీఓ స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఆదివారం స్థానిక కంఠభౌంసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో 288 మంది ఉద్యోగులు పాల్గోన్నారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను నిర్వహించారు. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 267 మంది, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 12మంది, ఇతర జిల్లాల నుంచి 9 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించు కున్నారని వెల్లడించారు. రెండు రోజుల్లో 413 మంది ఉద్యోగులు ఓటింగ్‌ లో పాల్గొన్నారని చెప్పారు. ఈనెల 8వ తేదీ వరకు అరకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు విధులు నిర్వర్తించే ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా బ్యాలెట్‌ ఓటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా 44 మంది హౌమ్‌ ఓటింగ్‌ సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు ాల్గొన్నారు.

➡️