వర్షంతో ఉపశమనం

Apr 20,2024 23:56
జి.మాడుగులలో కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శనివారం భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములు గాలులతో భారీ వర్షం పడింది. ఇటీవల కొద్ది రోజులుగా మన్యంలో ఉష్ణోగ్రతల పెరిగి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. పాడేరులో గత పది రోజులుగా ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో పాడేరు మన్యమంతా ఆహ్లాద భరితంగా మారింది. మన్యంవాసులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది. వేసవిలో ఏప్రిల్‌, మే నెలలో మధ్యాహ్నం పూట పాడేరు ఏజెన్సీలో ఈదురు కాలులతో కూడిన భారీ వర్షాలు కురవడం పరిపాటి. ఏజెన్సీ అంతటా ఈ వేసవి వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి. వేసవి దుక్కులకు ఈ వర్షాలు ఉపకరిస్తాయని రైతులు చెబుతున్నారు.జి:మాడుగుల: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఎండ వేడిమికి మండల వాసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మధ్యాహ్న సమయంలో భారీ వర్షం కురవడంతో ఎండ నుండి ప్రజలు ఉపశమనం పొందారు.అనంతగిరి:మండలంలో ఒక్కసారిగా ఆశాశం మేఘావృతమై మెరుపులు, ఈదురు కాగాలతో కూడిన కుండ పోత వర్షం కురవడంతో మండలమంతా ఉపశమనం పొందారు. గత రెండు నెలలుగా ఎండతో పాటు వడగల్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు సుమారు రెండు గంటల సేపు ఏకదాటిగా కుండ పోత వాన కురవడతో సేద తీరారు.

➡️