ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం

స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎం. విజయ సునీత

ప్రజాశక్తి -పాడేరు : సార్వత్రిక ఎన్నికలలో పోలైన ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత ఆదేశించారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ లను జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, అరకు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ పిఓ వి. అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ పి.ధాత్రి రెడ్డి, అడిషినల్‌ ఎస్పీ ధీరజ్‌లతో కలిసి స్ట్రాంగ్‌ రూంలను శుక్రవారం తనిఖీ చేసారు. ఓట్ల లెక్కింపు గదులను పరిశీలించి, అభ్యర్ధులకు, ఏజెంట్లకు పరిశీలనకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇవియంలు, పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు భద్ర పరిచిన స్ట్రాంగ్‌ రూంలను తనిఖీ చేసి తలుపులకు వేసిన సీళ్లను పరిశీలించారు.భద్రతా సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసారు. తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డి.వి.ఆర్‌. ఎం.రాజు, డిఇ అనుదీప్‌, సిఐ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️