గిరిజనుల సమస్యలు పరిష్కారం

Apr 7,2024 23:49
అప్పలనర్సకు తిలకందిద్దుతున్న మహిళ

ప్రజాశక్తి-అరకులోయ:త్వరలో జరగనున్న అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, అనంతగిరి జెడ్పిటిసి దీసరి గంగరాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏజెన్సీ అభివృద్ధికి నిరంతరం పోరాడుతున్న పార్టీ ఒక సిపిఎం మాత్రమేనన్నారు.జివో 3కు చట్ట బద్దత, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల సాధనకు ఆదివాసి గిరిజనుల తరఫున చట్ట సభల్లో పోరాడి సాధించుకోవడం సిపిఎంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఆదివాసి గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన 1/70 చట్టం పటిష్టంగా అమలు, బాక్సైట్‌, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతులను రద్దు కోసం, మైనింగ్‌ అటవీ సంపదలను కాపాడుకోవడానికి సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. బిజెపికి తొత్తుగా ఉన్న టిడిపి, వైసిపి, జనసేన పార్టీలను ఆదివాసీలను ఓడిస్తేనే భవిష్యత్తులో గిరిజనులకు మనుగడ ఉంటుందని చెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. వేసవి కాలంలో మంచినీరు కల్పించడానికి కనీసం ప్రణాళికలు కూడా తయారు చేయలేని ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధిని ఎలా చేస్తాయని వారు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో గిరిజన ప్రాంత సమగ్ర అభివృద్ధికి పోరాడుతున్న సిపిఎం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బస్కీ మాజీ ఎంపీటీసీ, సిపిఎం మండల పార్టీ నాయకుడు బురిడీ దశరథ్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కిండంగి రామారావు, పొద్దు బాలదేవ్‌, పాంగి రాజు, పూజారి చందర్‌, బురిడి గోపాల్‌, సమర్ధి మెద్నొ, కృష్ణ, స్వామి, గోవింద్‌, వార్డు మెంబర్‌ సమర్థి మొస్య, గొల్లూరి అప్పలనాయుడు, బురిడి కొండబాబు, సొన బాబు, శోభన్‌ పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

➡️