ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

Apr 19,2024 00:25
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి-పాడేరు-: రానున్న సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 28,800 అధికంగా ఉన్నారని, మహిళలందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేసారు. ఎన్నికలలో ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించు కోనేందుకు చర్యలు తీసుకున్నందున ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో సుమారు 61 వేల మంది అధిక ఓటర్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా గత జనవరి 22న తుది జాబితా ప్రకటించిన తరువాత సుమారు ఎనిమిది వేల ఓటర్లను ఫారం -6 ద్వారా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు అందిన ఫారం -6 లను పరిశీలించి అప్‌ డేట్‌ చేశామన్నారు. జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఓటింగ్‌ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమె జరపడానికి ఎన్నికల కమిషన్‌ సూచించిందని చెప్పారు. ఎన్నికల సంఘం అనుమతితో జిల్లాలో 30 పోలింగ్‌ కేంద్రాల పేరు, లొకేషన్‌ మార్పు చేశాన్నారు. వై.రామవరం మండలంలో ఆరు పోలింగ్‌ కేంద్రాల నుండి పోలింగ్‌ అనంతరం మెటీరియల్‌ను హెలికాప్టర్‌లో తరలించేందుకు చర్యలు తీసుకున్నా మన్నారు. సుమారు 2,689 మంది పిఒ, ఎపిఒలకు, శిక్షణ ఇచ్చామని, 5,116 ఒపిఒలకు శిక్షణ ఇస్తామని, అనివార్య కారణాలతో హాజరు కానివారికి ఆన్లైన్‌ శిక్షణ ఇస్తామని స్పష్టం చేసారు. జిల్లాకు ముగ్గురు పరిశీలకులను నియమించారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, సువిధ యాప్‌తో నామినేషన్‌ దాఖలు చేసుకోవచ్చని, దానిని డౌన్‌ లోడ్‌ చేసి ఫిజికల్‌ ప్రతి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘనలతో నలుగురు వాలంటీర్లను, ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగిని విధులనుండి తొలగించడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత రెండు నెలల నుండి విస్తత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసామని, తొమ్మిది ఎస్‌ఎస్‌టి, 17 ఎఫ్‌.ఎస్‌.టి బృందాలు ఏర్పాటు చేసామని తెలిపారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లతో పాటు సబ్‌ డివిజన్‌ స్థాయిలో నాలుగు, జిల్లా స్థాయిలో ఒకటి కంట్రోల్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా చేపడుతున్నట్లు తెలిపారు.

➡️