సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం

Apr 20,2024 23:58
సమాట్లాడుతున్న పంకజ్‌ సింగ్‌

ప్రజాశక్తి-పాడేరు:ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్‌ సింగ్‌ సూచించారు. శనివారం కలెక్టరే మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల వ్యయ పరిశీలన, ఎస్‌ఎస్టి, వీడియోగ్రాఫర్స్‌, వీడియో విజుయల్‌ బందాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధుల వ్యయాల వివరాలను ఖచ్చితత్వంతో లెక్కించాలని ఆదేశించారు. పోటీలో ఉండే అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎన్నికల వ్యయంలోకే వస్తుందని, వాటిపై ఏఈఓలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల వ్యయం లెక్కింపులో పనిచేసే బృందాల నుంచి ఎప్పటికపుడు వివరాలు సేకరించాలని, వాటిని సంబంధిత పట్టికల ద్వారా ఎన్నికల వ్యయ రిజిష్టరులో నమోదు చేయాలని సూచించారు. పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించిన వ్యయ వివరాలను బి-16 ద్వారా ఎం.సీ.ఎం.సీ తెలియ జేస్తుందని, వాటిని కూడా వ్యయంలోకి లెక్కించాల్సి ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా చేసే వాటిని కూడా పరిశీలించి ఎన్నికల వ్యయంలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. స్టార్‌ క్యాంపెయి నర్లతో ప్రచారం నిర్వహించే వ్యయాన్ని పార్టీ, అభ్యర్ధి ఖాతాలకు సమానంగా చూపాలని తెలిపారు. పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల ఉమ్మడి ప్రచారంలో పాల్గొనే అభ్యర్ధుల వ్యయాలను కూడా సమానంగా నమోదు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్ధుల వ్యయాల లెక్కింపుకు సంబంధించి రిజిష్టర్లలో ఎప్పటికపుడు నమోదుచేసి, ఖర్చుల వివరాలను ఆయా వ్యయ పరిశీలకులకు అందజేయాలని తెలిపారు. ఈ విషయమై పలువురు అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. అభ్యర్దుల, పార్టీల ఖర్చులకు సంబందించిన అంశాలపై 9381134602 /9381126301 నంబర్లకు ఫోన్‌ చేసి తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వ్యయ పరిశీలకులు తెలిపారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలన నోడల్‌ అధికారి సువర్ణ ఫణి, ఎంసిఎంసి సభ్యులు పి.గోవింద రాజులు, పి. రాములు, సహాయ వ్యయ పరిశీలకులు, వివిటి, ఎస్‌ఎస్టి బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️