అసంపూర్తిగా నిలిచిన రోడ్డు పనులు

రాళ్లు తేలి ఉన్న జర్రెల గ్రామ రహదారి ఇదే

ప్రజాశక్తి ముంచింగి పుట్టు :- మండలనికి కూత వేటు దూరంలో ఉన్న జర్రెల గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు -ముంచంగిపుట్టు ప్రధాన రహదారికి ఆనుకొని దాసరిపుట్‌ గ్రామం నుండి జర్రెల పంచాయతీ కేంద్రానికి వెళ్లేందుకు సుమారుగా 3 కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ, రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2018 సంవత్సరంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఆనాటి గ్రామ సర్పంచ్‌ వంతల లలిత ఎంతో కృషి చేసి తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి తీసుకొచ్చారు. రహదారి పనులు ప్రారంభించి రహదారి పొడుగునా గులకరాళ్ళను (మెటల్‌ రాళ్లు) వేసి వదిలేసారు. వేసిన మెటల్‌ పై కనీసం రోలరింగ్‌ సైతం చేపట్టలేదు. పంచాయితీ కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి కావడం, రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో సుమారు 18 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, రేషన్‌ సరుకులు వంటి సదుపాయాలు పొందటం కోసం పంచాయతీ కేంద్రానికి వెళ్ళాల్సి ఉంది. రహదారి బాగు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాళ్లు తేలిన రోడ్డుపై ఓటు వేసేందుకు ఎలా అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.రహదారి గుండా అనేక గ్రామాలకు చెందిన గిరిజనులు, పాదచారులు, వాహనదారులు రాకపోకలు అనునిత్యం చేస్తుంటారు. రహదారి మరమ్మతు చేపట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️