పర్యాటక ప్రాంతాలు వెలవెల

ఖాళీగా ఉన్న పద్మావతి ఉద్యానవన కేంద్రం

ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలోని సందర్శింత ప్రాంతాలు వెలవెల బోతున్నాయి. ప్రతి ఏడాది టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల అనంతరం పర్యాటకులు అధిక సంఖ్యలో అరకు ప్రాంతాన్ని సందర్శించేవారు. ఈ ఏడాది ఎన్నికల హడావుడి మొదలు కావడంతో పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. పర్యాటకులు మచ్చుకైనా కనిపించక పోవడంతో ఈ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. కాలాలతో సంబంధం లేకుండా నిత్యం కలకలలాడే అరకులోయ ఇప్పుడు వెలవెల పోతుండటంతో స్థానిక వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు మునుపెన్నడు లేనివిధంగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అరకులోయ పర్యాటకం పడకేసింది. అరకులోయలోని గిరిజన సంస్కతిక మ్యూజియం, పద్మావతి ఉద్యానవన కేంద్రంలో ఆదాయం పూర్తిగా పడిపోవడంతో నిర్వహణకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నెల కొంటున్నాయని సంబంధిత అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని స్థానికులు, పలువురు పర్యాటకులు అభిప్రాయ పడుతున్నారు.

➡️