పట్టపగలే వృద్ధురాలి దారుణ హత్య

Jun 19,2024 23:01

ప్రజాశక్తి – వినుకొండ : సొమ్ము కోసం వృద్ధురాలని హత్య చేసిన సంఘటన పట్టణంలోని కొత్తపేట విద్యానగర్‌ 6వ లైన్‌లో బుధవారం జరిగింది. పల్నాడు జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌ అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీపతి వివరాల ప్రకారం… స్థానికురాలైన పి.కోటిరత్నమ్మ (75) భర్త ఏసుదాసు వేరే పని మీద బయటకు వెళ్లగా కుమారుడు రవి వార్డు సచివాలయ శానిటేషన్‌ సెక్రెటరీ కావడంతో ఆ విధుల్లో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కోటిరత్నం ఒక్కరే ఇంట్లో ఉండగా ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి జొరబడ్డారు. కోటిరత్నమ్మపై దాడి చేశారు. ఆమె కంటిపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం దుండగులు పారిపోయారు. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునేందుకు ఈ దాడి జరిగిందని, మృతురాలి మెడలో ఉండాల్సిన చైను ఆమె చేతిలో పట్టుకుని ఉన్నారని, దుండ గులను ప్రతిఘటించే క్రమంలో బలమైన గాయాలు తగలడంతో కోటిరత్నం మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. దాడి సందర్భంలో ఇంటి వెనుక భాగంలో ఉన్న బాలుడు ఈ విషయాన్ని చెప్పారని, వీధిలో ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా హంతకులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిని పట్టణ సిఐ సాంబశివరావు పరిశీలించారు. మృతురాలి భర్త ఏసుదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుంటూరు నుండి వేలిముద్రల సేకరణ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో కొత్తపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రతిరోజూ కోటిరత్నమ్మ ఆ ప్రాంత మహిళలతో అరుగుల మీద కూర్చొని సరదాగా మాట్లాడేవారని, ఆ సమయంలో ఆమెపై ఉన్న బంగారాన్ని గమనించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పట్ట పగలు హత్య చేసి హంతకులు వారిపోవటం వంటివి ఎప్పుడూ ఈ ప్రాంతంలో జరగలేదని అంటున్నారు. ఒకవైపు కాల్వ కట్ట బజార్‌, మరోవైపు గీతాంజలి స్కూల్‌ ఎదురు బజార్‌, కూత వేటులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నివాసాలు, ప్రతిరోజు అధికారులు, ప్రజల సంచారంతో రద్దీగా ఉండే ప్రాతంలో దారుణం ఏమిటని భయపడుతున్నారు.

➡️