అంగన్‌వాడీల ఆందోళన

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో నిరసన చేపట్టారు. ప్రాదయాత్రలో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. రావికమతం : సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రాజెక్టు కార్యాలయ సమీపంలో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. వారినుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి సత్యవేణి, నాయకులు వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, సూర్యకాంతం, కమల, రామేశ్వరి, అమ్మాజీ, సిఐటియు జిల్లా నాయకులు సత్యవతి పాల్గొన్నారు. నిరసన కనబడకుండా పరదా అంగన్‌వాడీల ఆందోళన బయటకు కనిపించకుండా ఇక్కడ పరదా కట్టారు. మంగళవారం వైసిపి సామాజిక సాధికార బస్సుయాత్ర ఈ ప్రాంతంలో సాగింది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని చూపేందుకు స్థానిక అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారు. అంగన్‌వాడీల నిరసన బయట ప్రపంచానికి కనబడకుండా స్థానిక పోలీసులు, నాయకులు ఇలా పరదా కట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుపై సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు మండిపడ్డారు.మాడుగుల: సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సమ్మెకు దిగింది. మంగళవారం ఈ మేరకు మాడుగుల, చీడికాడ మండలాలకు సంబంధించి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి సమ్మెలు కొనసాగుతాయని, ప్రభుత్వం తమ సమస్యల విషయమై 12 అంశాలతో కూడిన డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మూకుమ్మడి సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జవాబు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను వివిధ రకాలుగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రెండు మండలాల అంగన్వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ( సిఐటియు )సభ్యులు పాల్గొన్నారు.నక్కపల్లి:సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. నక్కపల్లి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు, హెల్పర్లు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు జీతాలు పెంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రాడ్యుటి, పెన్షన్‌ అమలు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ, జనసేన నాయకులు లక్ష్మీ శివకుమారి, నాయకులు కోసూరి నాని బాబులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎం.దుర్గారాణి, యూనియన్‌ నాయకులు బి.సుబ్బలక్ష్మి, బి.నాగేశ్వరరావు, పి.రమణమ్మ, కవిత, కె.నూకరత్నం, వై.సత్యవణి పాల్గొన్నారు.గొలుగొండ:స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మంగతాయి, మండల కమిటీ అధ్యక్షురాలు భ్రమరాంబ మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలన్నారు.గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, ఈరెల్లి చిరంజీవి పాల్గొన్నారు.అంగన్వాడీల నిరసనలుకె.కోటపాడు : అంగన్‌వాడీ యూనియన్ల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం సమ్మె చేసిన అంగన్వాడీలు స్థానిక అంగన్వాడీ ప్రాజెక్టు ఆఫీసు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు లీడర్లు కుమారి, ఎం లక్ష్మి, బి ఇందిర, ఏ ఈశ్వరమ్మ, వరలక్ష్మి, కోమలి, అమ్మాజీ, సిఐటియు నాయకులు నాయుడు బాబు, రొంగలి ముత్యాల నాయుడు, ఎర్ర దేవుడు తదితరులు పాల్గొన్నారు.సబ్బవరం : సబ్బవరం ఐసిడిఎస్‌ కార్యాలయం ఆవరణలో ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, యూనియన్‌ నాయకురాలు వివి రమణమ్మ, ఎం రమణి, బి, రమణమ్మ, సిహెచ్‌ దేవి, జి అమ్మాజీ, ఎస్‌ జగదీశ్వరి, ఆర్‌ఎస్‌ లక్ష్మి, డి పుష్పదేవి, ఎం వరలక్ష్మి వ్యకాస జిల్లా ఉపాధ్యక్షురాలు ఉప్పాడ సత్యవతి, ఎం. గౌరేష్‌, కోటి పాల్గొన్నారు. సిఐటియు మద్దతుఅనకాపల్లి : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ మేరకు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకర్రావు, జి.కోటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసి సమ్మె విచ్ఛిన్నం చేయాలని చూసిందని, ఐక్యంగా అంగన్వాడి ఉద్యోగులందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.విశాఖపట్నం : మర్రిపాలెం వద్దనున్న ఐసిడిఎస్‌ అర్భన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో చంటి పిల్లలతో సహా అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినదించారు. కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి, అధ్యక్షులు వై.తులసి, నాయకులు శోభారాణి, వెంకటలక్ష్మి, ఇందిర, నాగేశ్వరి, ఎఐటియుసి నాయకులు బి.శ్యామల పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్‌ సర్కారు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. భీమునిపట్నం: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద ధర్నాలో మాట్లాడుతూ, అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని, తలెత్తే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్‌ జిల్లా కోశాధికారి పి పద్మావతి, నాయకులు శ్రీదేవి, శాంతి కుమారి, శ్రీ గౌరి, ధనలక్ష్మి, సుగుణ, నూర్జహాన్‌, పార్వతి, సిఐటియు జోన్‌ అధ్యక్షులు రవ్వ నరసింగరావు పాల్గొన్నారుపెందుర్తి : సమస్యల పరిష్కారానికి అంగన్వాడీల సమ్మెలో భాగంగా స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి బి.జగన్‌, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.దేవి, గౌరవ అధ్యక్షురాలు కె.బృంద, నాయకులు బి.భవాని, ఆర్‌ అనిత, సరస్వతి, కళ, చిన్నమ్మలు, సోమేశ్వరి, వేణు, జ్యోతి, గంగ, సిఐటియు పెందుర్తి జోన్‌ నాయకులు అప్పలనాయుడు, శంకరరావు పాల్గొన్నారు.ప్రజాశక్తి- కశింకోట :కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్‌కు తగిన నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తుందని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు సమ్మెలో భాగంగా కశింకోట ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన నిరాహార దీక్షా శిబిరాన్ని లోకనాథం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు నిధులు లేక దేశంలో పోషకాహార లోపం కొనసాగుతుందని, ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరిగి మన దేశ స్థానం ప్రపంచంలో దిగజారిందని పేర్కొన్నారు. రకరకాల పథకాల పేర్లతో మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చెయ్యడం లేదన్నారు. అనేక యాప్‌లు పెట్టి వర్కర్లపై తీవ్ర పని ఒత్తిడి పెంచిందని, దీంతో ఫ్రీ స్కూల్‌ నిర్వహణకు కూడా ఆటంకంగా మారిందని తెలిపారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు డిడి.వరలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు డి.శ్రీనివాసరావు, అంగన్వాడీ యూనియన్‌ మండల అధ్యక్షులు తునూజ, పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️