ఆదివాసీల ఆందోళన

Jan 20,2024 00:15
నినాదాలు చేస్తున్న నాయకలు, గిరిజనులు

ప్రజాశక్తి-మాడుగుల: ఊర్లోవను రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని మోకాళ్లపై ఆదివాసీలు ధర్నా చేశారు. మండలంలోని బొమ్మలి జగన్నాధపురం పంచాయతీ గదబూరు గ్రామంలో మోకాళ్లపై నిలుచునిశుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కార్లే భవాని, ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి గిరిజన సంఘం నాన్‌ షెడ్యూల్‌ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడారు. భూములకు చట్టపరమైన హక్కులు కల్పించాలని, ఊర్లోవ రెవెన్యూ వెబ్లాండ్‌ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రానైట్‌ కంపెనీ నుండి రక్షణ కల్పించాలన్నారు. ఊర్లోవ రెవెన్యూ పరిధిలో 450 ఎకరాల్లో 350 మంది ఆదివాసి గిరిజనులు, ఇతర పేదలు జీడి మామిడి తోటలను సాగు చేస్తున్నారని, వీరికి 2013 సంవత్సరంలో పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఊర్లోవ రెవెన్యూ గ్రామం రెవెన్యూ రికార్డులో రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌ కూడా ఉందని, అన్‌ సెటిల్మెంట్‌ విలేజ్‌గా నమోదు చేశారని, రెవెన్యూ రికార్డు లేకపోవడంతో ఆదివాసి గిరిజనులకు ఇచ్చిన పట్టాలని నమోదు చేయలేదని వారు తెలిపారు. మరోవైపు గ్రానైట్‌ క్వారీలకు విరివిగా అనుమతులు మంజూరు చేస్తున్నారని వారు విమర్శించారు. అనేకసార్లు ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ గిరిజనులపై వివక్ష కొనసా గుతుందన్నారు. భూములకు హక్కులు కల్పిస్తామని, రైతు భరోసా, ఈ క్రాఫ్ట్‌ బ్యాంకు పంట రుణాలు వంటి పథకాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నా.. రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద వంటావార్పు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఈదల మచ్చి రాజు, నిమ్మకాయల రాము, గేదెల నూకరాజు, ఈదెల కరుణ, ఖాతా చిలుకు మరియు గిరిజనులు పాల్గొన్నారు.

➡️