ఉత్సాహంగా కేన్సర్‌ వాక్‌

ఎస్‌.రాయవరంలో ర్యాలీ చేపడుతున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : ప్రపంచ కేన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం మహాత్మా గాంధీ కేన్సర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్‌ రోడ్డులోని కాళీ మాతా గుడి నుంచి వైఎంసిఎ వరకు ‘క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌’ అనే థీమ్‌తో కేన్సర్‌ అవేర్‌నెస్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ కేన్సర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెన్న మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలో కోటి మంది ప్రజలు కేన్సర్‌ బారిన పడి మృతిచెందారన్నారు. 2030కి ఆ సంఖ్య మరింత పెరగనుందని తెలిపారు. కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించడం సలభమన్నారు. వాక్‌లో సిఐఐ, గీతం డెంటల్‌ కాలేజీ, యంగ్‌ ఇండియన్‌, ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ (ఐ డబ్ల్యుఎన్‌), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఎపిఎన్‌ఎ, ఎఎస్‌హెచ్‌ఎ, గాయత్రీ విద్యా పరిషత్‌ మెడికల్‌ కాలేజ్‌, అనిల్‌ నీరుకొండ మెడికల్‌ కాలేజ్‌, రోటరీ క్లబ్‌ విశాఖ, వైజాగ్‌ ట్రైల్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌, ఇంటర్నేషనల్‌ వాకర్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌, రోహిత్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌, ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌, శ్రేయ కేన్సర్‌ ఫౌండేషన్ల నుండి సుమారు రెండు వేల మంది సభ్యులు పాల్గొన్నారు. కేన్సర్‌పై అవగాహన ర్యాలీలు ఆనందపురం : ప్రపంచ కేన్సర్‌ దినోత్సవం సందర్భంగా కారుణ్య కేన్సర్‌ ఫౌండేషన్‌, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యాన వేములవలస కూడలిలో కేన్సర్‌పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కేన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నవ్య మాట్లాడుతూ, కేన్సర్‌పై అవగాహన లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు. దురాలవాట్లకు దూరంగా ఉంటూ మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి భారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఆర్‌ఎంపి జోనల్‌ అధ్యక్షుడు, కారుణ్య కేన్సర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ జంగం జోషి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ కార్యదర్శి కోన ప్రకాష్‌, టీం సభ్యులు సత్య, రాధిక, మేఘన, డాక్టర్‌ హేమలత, సంతోషి, నవ్య హాస్పటల్‌ అధినేత జానకిరామ్‌, జయరావు, గ్రామీణ వైద్యులు పి.సుధాకర్‌ రెడ్డి, కెఎన్‌.రావు, పి.కనకారావు, వినోద్‌, వాసు, తదితరులు పాల్గొన్నారు. ఎస్‌.రాయవరం:మండలంóలో సర్వసిద్ధి పీ.హెచ్‌.సి, సైతారపేట, ఎస్‌.రాయవరం గ్రామాల్లో కేన్సర్‌ వ్యాధిపై అవగాహన శిబిరాలు, ర్యాలీలు నిర్వహించినట్టు మెడికల్‌ ఆఫీసర్‌ ఎన్‌.వాసంతి తెలిపారు. పి.హెచ్‌.సి వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో వాసంతి మాట్లాడుతూ, సరిగా వుడకని మాంసాహారాలు భుజించడంతో కేన్సర్‌ బారినపడుతున్నరన్నారు. వాయు కాలుష్యం , పని ఒత్తిడి, ఫాస్ట్‌ ఫుడ్స్‌, బేకరీ, ఆయిల్‌ ఫుడ్స్‌ తినడంతో కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. కొన్ని రకాల క్యాన్సర్‌లు వంశపారం పర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుని, మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు. హెల్త్‌ విజిటర్‌ ఎస్‌.సూర్య కుమారి, స్థానిక హెల్త్‌ సెక్రెటరీ ఎం.రాజేశ్వరి పాల్గొన్నారు.

➡️