టిడిపి హయాంలో హామీలు విస్మరణ

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:గత రెండు రోజులుగా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన లోకేష్‌ యువగళం పాదయాత్రను చూస్తుంటే కామెడీ యాత్రను తలపిస్తుందని జిల్లా వైకాపా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌ విమర్శించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు కొరుప్రోలు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా, రైతు రుణమాఫీలు అంటూ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పబ్బం గడిపిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉన్న కాలంలో పాయకరావుపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో మాజీ ఎమ్మెల్యే అనిత, ఇతర తెదేపా నాయకులు తెలపాలన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ, టిడిపి అధికారంలో ఉండగా నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్‌ తెస్తామని, నక్కపల్లి ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని పలు హామీలు ఇచ్చి మరిచిన ఘనత టిడిపిదని, అధికార తాపత్రయం తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచన లేని నీచ సంస్కతి చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, బడుగు, బలహీన, వర్గాలకు, అనేక సంక్షేమ పధకాలను అందించారన్నారు.నారా లోకేష్‌ మరో మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, అధికారం కోసం అర్రులు చాస్తూ భ్రమలో బతుకుతున్నారని, టిడిపి పార్టీకి చంద్రబాబుకే భవిష్యత్తు లేదన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, చిక్కాల రామారావు, మాతా గురునాధరావు, పోలిశెట్టి పెద ఈశ్వర్రావు, అద్దేపల్లి నూకునాయుడు, దుబాసి సాయి, లొడగల చంద్రరావు, శ్రీపతి రాజు, జనపరెడ్డి శేషారత్నం, మణిరాజు, నీలేంద్రరావు పాల్గొన్నారు.

➡️