నష్టపరిహారం నమోదులో అలసత్వం

నష్టపరిహారం నమోదులో అలసత్వం

ప్రజాశక్తి-రావికమతం:మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పైల రాజు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు విధిగా హాజరు కావలసి ఉన్నప్పటికీ ఆ దిశగా పూర్తిస్థాయిలో రాకపోవడం పట్ల కొత్తకోట ఎంపిటిసి పూడి దేవా, గుడ్డిప సర్పంచ్‌ గణేష్‌, గంపవానిపాలెం సర్పంచ్‌ రామకృష్ణ పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిచౌంగ్‌ తుఫానుకు నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం చెల్లించే దిశగా మండల వ్యవసాయ శాఖ అధికారి, కమిటీ సభ్యులు చర్యలు చేపట్టకపోవడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. వరి పంట రైతులను నేటికీ గుర్తించక పోవడం బాధాకరమన్నారు. గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఆర్‌ బి కే ఇంచార్జ్‌తో కూడిన కమిటీ వేయడం జరిగిందని, వారు తుపాను నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించవలసి ఉన్నప్పటికీ ఆ దిశగా చేయలేదని కవగుంట సర్పంచ్‌ దాసరి సూర్య కుమారి, గుడ్డిప సర్పంచ్‌ గణేషు, గంపవానిపాలెం సర్పంచ్‌ రామకృష్ణ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నవోలు పంచాయతీలో విద్యుత్‌ వైర్లు చేతులకు అందే విధంగా ఉన్నాయని విద్యుత్‌ శాఖ ఏఈనకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రమాదం ముంచుకు వచ్చేవరకు పనిచేయరా అంటూ విద్యుత్‌ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకన్నబాబు, తహశీల్ధార్‌ మహేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ రమణ భవాని ప్రసాదు పలువురు పాల్గొన్నారు.

➡️