పాయకరావుపేటలో ‘యువగళం’ పాదయాత్ర

పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్న అనిత

ప్రజాశక్తి-నక్కపల్లి:జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ చేపట్టనున్న యువ గళం పాదయాత్రను విజయవంతం చేయడానికి టిడిపి శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములు చేసేందుకు నాయకత్వం ప్రణాళిక తయారు చేసింది. పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ నెల 11న లోకేష్‌ ప్రవేశించనున్నారు. లోకేష్‌కు పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలకాలని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని సారిపల్లివాని పాలెం వద్ద తన ఇంటి ప్రాంగణంలో శనివారం జరిగిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో అనిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లోకేష్‌ పాదయాత్ర 11న పాయకరావుపేట చేరుకొనేటప్పుడు పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. 12న పాయకరావుపేట వైభవ్‌ లే-అవుట్‌ దగ్గర నుంచి పాదయాత్ర బయలుదేరుతుందన్నారు. గొడిచర్లకు పాదయాత్ర చేరేసరికి పదివేల మంది మహిళలతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 13 వరకు పాదయాత్ర కొనసాగుతున్నందున నియోజక వర్గంలోని కార్యకర్తలు, స్థానిక పార్టీ బాధ్యులు మండల ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాదయాత్ర నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ముఖద్వారం పాయకరావుపేట నియోజకవర్గంలో లోకేష్‌కు పలికే స్వాగతం ప్రజల మనస్సుల్లో నిలిచి పోయేలావుండాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చింతల రామకృష్ణ, కాకినాడ రామారావు, మాజీ ఎమ్మెల్సీ బాబురావు మాస్టర్‌, ప్రభాకర్‌, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి లాలం కాసినాయుడు, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్‌ రాజు, మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌, పార్టీ జిల్లా నాయకులు జనార్ధన్‌, గింజాల లక్ష్మణరావు, కురందాసు నూకరాజు, దేవర సత్యనారాయణ, నల్లల వెంకటరాజు, కొప్పిశెట్టి బుజ్జి, వెలగా శ్రీనివాస్‌, గోసల శ్రీకాంత్‌, గుర్రం రామకృష్ణ, పెద్దిరెడ్డి శ్రీనివాసరావు, కోన అప్పలరాజు, నాగరాజు, వెదుళ్ళ పాపారావు, మహిళా అధ్యక్షురాలు రమా కుమారి, ఆకేటి శాంతి, సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

➡️