రేషన్‌ బియ్యం ఇస్తే సరిపోతుందా?

కోటవురట్ల మండల సమావేశంలో ప్రశ్నిస్తున్న సభ్యులు

 

ప్రజాశక్తి-కోటవురట్ల:కరువు మండలంగా ప్రకటించడంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల బుధవారం ఎంపీపీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు నిలదీశారు. గ్రామాల్లో కేవలం రేషన్‌ బియ్యం మాత్రమే ఇస్తున్నారని, మిగిలిన సరుకులు సరఫరా చేయలేదని సభ్యులు రెవెన్యూ అధికారులను నిలదీశారు.కోటవురట్ల ఎంపీటీసీ సభ్యులు సూర్యరావు సహా పలువురు సభ్యులు మాట్లాడుతూ, అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని సభ దృష్టికి తీసుకువెళ్లారు. అన్నవరం ఎంపీటీసీ సభ్యురాలు శెట్టి రమణమ్మ జల్జీవన్‌ మిషన్‌ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఒక ప్రాంతానికి నీరు వచ్చి మరో ప్రాంతానికి నీరు రాకపోవడం ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని మండలంలో ఏర్పాటు చేయాలని కోరారు.ఇసుకను అక్రమంగా తరలించకపోతున్న రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం పట్ల జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాండవ కాలువ నీలుగుంట వద్ద కల్వర్టు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోలేదని సర్పంచ్‌ వరహాల బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, డిప్యూటీ తహసిల్దార్‌ సోమశేఖర్‌, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు నక్కపల్లి:మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ రత్నం అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పలువురు సభ్యులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని తహసీల్దార్‌ అంబేద్కర్‌ను కోరారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు త్వరితగతిన పాసు పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.న్యాయంపూడి ఎంపీటీసీ సభ్యులు ఆకేటి గోవిందరావు మాట్లాడుతూ, రేషన్‌ సరుకులు కందిపప్పు, పంచదార పూర్తిస్థాయిలో సరఫరా చేయాలన్నారు. పెదతీనార్ల ఎంపీటీసీ సభ్యులు మెరుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ 128లో మూడు ఎకరాల రాస్తా భూమిని ఒక వ్యక్తి కబ్జా చేశారని వెంటనే, భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని తహసీల్దార్‌ను కోరారు. ఉపమాకలో డంపింగ్‌ యార్డ్‌కు స్థలం కేటాయించాలని సర్పంచ్‌ ప్రగడ వీరబాబు కోరారు. సచివాలయ వ్యవసాయ అసిస్టెంట్లు గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులకు ఎటువంటి సమాచారం ఇవ్వ లేదని ఎంపీపీ అధ్యక్షతన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ను వైస్‌ ఎంపీపీలు నానాజీ, ఈశ్వరరావు కోరారు.సిహెచ్‌సి సూపరింటెండెంట్‌ ఈశ్వర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ, గుండు పోటు లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వారికి అత్యవసర స్టేమి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, వైస్‌ ఎంపీపీలు నానాజీ, ఈశ్వరరావు పాల్గొన్నారు .

➡️