నర్సీపట్నంలో అయ్యన్న గెలుపు

అయ్యన్న ఇంటి వద్ద నాయకుల సందడి

ప్రజాశక్తి-నర్సీపట్నం:నర్సీపట్నం అసెంబ్లీ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మొత్తం 19 రౌండ్‌లలో జరిగింది. రెండు రౌండ్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టిడిపి అభ్యర్థి అయ్యన్నపాత్రుడు, తన సమీప వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెట్లఉమాశంకర్‌ గణేష్‌ పై 24676 ఓట్ల తో విజయం సాధించారు. నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అయ్యన్న కాలనీలో తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అయ్యన్న ఇంటికి అభిమానులు వెల్లువెత్తారు.నర్సీపట్నంలో ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణాలు చేపట్టిన టిడ్కో ఇళ్ల పంపిణీ చేయక పోవడం, పట్టణ అభివృద్ధి పై పూర్తిగా దృష్టి పెట్టకపోవడం, నందమూరి తారక రామారావు ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై కనీసం పట్టించుకోకపోవడం వైసిపి ఓటమికి కారణమని స్థానికులు అంటు న్నారు. అభి వృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతోనే వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం చేకూరిందన్నారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించి పట్టణ అభివృద్ధి పై దృష్టి పెడితే బాగుండేదని నియోజకవర్గ ప్రజలు తెలిపారు.పట్టణ ప్రజలకు ప్రధాన సమస్య రోడ్లు విస్తరణ, ట్రాఫిక్‌ సమస్యపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ దృష్టి పెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో విస్తరణ చేపట్టకపోవడం కొంత ఓటమికి కారణంగా భావించవచ్చు

➡️