దాడులపై గవర్నర్ మౌనం మంచిది కాదు

May 24,2024 14:44 #anakapalle district

భీశెట్టి బాబ్జి
ప్రజాశక్తి-అనకాపల్లి : రాష్ట్రంలో పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు, దాష్టీకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగి, రాష్ట్ర ప్రతిష్ట దిగజరిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా గవర్నర్ అబ్దుల్ నజీర్ మౌనం వహించడం సరికాదని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. అనకాపల్లి రింగురోడ్డు జనసేన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రస్తుతం జరిగిన ఎన్నికలు మూడోసారని, ఎప్పుడూ జరగని అల్లర్లు, దాడులు, దాష్టీకాలు ఇప్పుడే జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో జరిగిన దాడుల వలన రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఎన్నికల కౌంటింగ్ తరువాత జరిగే పరిస్థితిని అంచనా వేసి పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ని ప్రజలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు ఎన్నికల్లో పాల్గొని విధులు నిర్వహిస్తున్న ఆర్వోలు, పిఓ లు, ఏపీఓ లు విధులు నిర్వహించలేక భయపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తక్షణమే స్పందించి ప్రధాన రాజకీయ పార్టీ నేతలను పిలిపించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలూ పోలీసులను, పరిపాలనా వ్యవస్థను,ఎన్నికల సంఘం ప్రతినిధులను విఫలమయ్యారని ఆరోపిస్తుంటే వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్ పై ఉందని భీశెట్టి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం నిజాయితీగా పనిచేసే పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల విమర్శలతో నలిగిపోతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను అందరూ సమిష్టిగా కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని భీశెట్టి కోరారు. ఈ సమావేశంలో అడపా నరసింహంమూర్తి, తుమ్మపాల మాజీ ఎంపిటిసి సభ్యుడు కనుబుడ్డి నరసింగరావు, పౌర వేదిక ప్రతినిధి కొలసాని రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️