అంగన్‌వాడీలకు అండగా ప్రత్యక్ష పోరాటాలు

రౌండ్‌టేబుల్‌ సమవేశంలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

    అనంతపురం కలెక్టరేట్‌ : న్యాయమైన డిమాండ్‌లతో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే అంగన్‌వాడీ కార్మికులకు అండగా ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని అఖిలపక్ష పార్టీల నేతలు తెలిపారు. అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా శుక్రవారం నాడు అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, టిడిపి జిల్లా నాయకులు లక్ష్మి నరసింహులు, జెఎం.బాషా, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, సిపిఐఎంఎల్‌ జిల్లా నాయకులు సి.చంద్రశేఖర్‌, ఎస్‌యుసిఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, అంగన్‌వాడీ కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, జిల్లా కోశాధికారి జమున, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్‌, రైతు సంఘం జిల్లా నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ముస్కిన్‌, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు, ప్రజలందరి పార్టీ నాయకుడు వెంకటసుబ్బయ్య, ప్రజా గాయకుడు ఆదినారాయణ, నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు టిపి.రామన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ 32 రోజులుగా అంగన్‌వాడీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్మా ప్రయోగించడం, నోటీసులు ఇవ్వడం దుర్మార్గంగా ఉందన్నారు. నాలుగు దపాలుగా చర్చలు జరిపి వేతనం పెంపుదల గురించి మాట్లాడకపోవడం ప్రభుత్వ ద్వందనీతికి నిదర్శనం అన్నారు. వెంటనే ఎస్మా చట్టాన్ని రద్దు చేసి, అంగన్‌వాడీల న్యాయమైన అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేవారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటం చాలా గొప్పదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదరగొట్టినట్లు అంగన్‌వాడీ కార్మికులను చేయాలని చూసిన ప్రభుత్వాన్ని అంగన్‌వాడీలు ధైర్యంగా ఎదర్కొంటారని తెలిపారు. సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో అంగన్‌వాడీలను ఇబ్బందులకు గురి చేసిన ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో గెలవలేకపోయిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇదే జరుగుతుందన్నారు. టిడిపి నాయకులు నరసింహులు మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అనంతరం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అంగన్‌వాడీల వేతనాలు పెంపుదల చేశాకే సమ్మె విరమించాలని, అప్పటి వరకు ఐక్య పోరాటాలు చేయాలని, శనివారం నుంచి అంగన్‌వాడీలకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలనే తీర్మానాలు చేశారు.

➡️